న్యూఢిల్లీ : మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత రత్న పురస్కారం ప్రదానం చేయాలన్న నిర్ణయంతో దేశంలో అత్యున్నత పౌర పురస్కార విజేతల సంఖ్య 53కు చేరుకున్నది. వారిలో ఐదుగురికి ఈ ఏడాది (2024లో) ప్రకటించడమైంది. ఒక ఏడాది ఇంత ఎక్కువగా అవార్డు ప్రకటించలేదు. ఇప్పటి వరకు 1999లో మాత్రమే గరిష్ఠ సంఖ్యలో భారత రత్న పురస్కారాల ప్రకటన జరిగింది. ఆ ఏడాది నలుగురికి ప్రతిష్ఠాకరమైన ఆ అవార్డు ఇచ్చారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్‌లకు భారత రత్న ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు. నరసింహారావు విధానాల సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థను విప్లవీకరించగా, చరణ్ సింగ్ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం పాటుపడ్డారు. స్వామినాథన్‌ను హరిత విప్లవ సారథిగా పరిగణిస్తుంటారు. పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జాట్ నేత చరణ్ సింగ్ దేశంలో రాజకీయ రంగంలో కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న సమయంలో ఆ పార్టీ రాజకీయాలను గట్టిగా వ్యతిరేకించిన నేతలలో ఒకరు.
ఇక పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలను నాంది పలికిన నేతగా విస్తృత స్థాయిలో గుర్తింపు పొందారు. సుప్రసిద్ధ భారతీయ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ అధిక దిగుబడి ఇచ్చే గోధుమ, వరి వంగడాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా 1960, 1970 దశకాలలో దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. కాగా, చివరిఆ సారిగా భారత రత్న అవార్డును 2019లో ప్రణబ్ ముఖర్జీకి ప్రదానం చేశారు. అదే సంవత్సరం భూపేంద్ర హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు మరణానంతరం అవార్డు ప్రదానం జరిగింది. 2020, 2023 మధ్య ఎవరికీ ఈ అవార్డు ప్రదానం జరగలేదు. కేంద్ర ప్రభుత్వం 1954లో రెండు అత్యున్నత పౌర పురస్కారాలు & భారత రత్న, పద్మ విభూషణ్‌లను ప్రవేశపెట్టింది. పద్మ విభూషణ్‌లో మూడు తరగతులు & పెహలా వర్గ్, దూస్రా వర్గ్, తీస్రా వర్గ్ అని ఉండేవి. వాటికి ఆ తరువాత 1955 జనవరి 8న రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అని తిరిగి నామకరణం చేశారు.