హైదరాబాద్: రేవంత్ రెడ్డి సర్కారుపై నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ ప్రభుత్వ పాలన నడుస్తోందని ఆయన అన్నారు. ఇచ్చి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ సర్కారు పూర్తి చేయలేదని.. సిఎం రేవంత్ సిసిపియూ(కనెక్ట్, కలెక్ట్, పే, యూజ్) కోర్సు పూర్తి చేశారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి కాంగ్రెస్ ఇన్ని వాగ్ధానాలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.
రాష్ట్రంలో పరిపాలన శూన్యమని.. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా, హెచ్‌సియు డ్రామాలు అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనలో పెద్దల నుంచి అంగన్వాడిలో చదువుకొనే పిల్లల వరకూ ఎవరూ సంతోషంగా లేరని పేర్కొన్నారు. కెసిఆర్ గజదొంగ గంగన్న అయితే.. రేవంత్ ఆయన కొడుకు రంగన్నలా తయారయ్యారని అన్నారు. హెచ్‌సియు విషయంలో ఓ బిజెపి ఎంపి ప్రమేయం ఉందని అంటున్న కెటిఆర్.. ఆ ఎంపి పేరును ఎందుకు బయటపెట్టడం లేదని అడిగారు.