Monday, December 23, 2024

ఉత్పత్తి లక్ష్య సాధనలో ఈ మూడు నెలలే కీలకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : ఈ వర్షాకాలంలోనూ సింగరేణి కాలరీస్ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 75 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలంటే ఈ మూడు నెలలు అతికీలకమని సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. వర్షాకాలంలో ఉపరితల గనుల్లో ఉత్పత్తి కుంటు పడకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలను ఇప్పటి నుండే చేపట్టాలని అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్లను ఆయన ఆదేశించారు. ఈ మూడు నెలల్లో రోజుకు 2 లక్షల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో అన్ని ఏరియాల జిఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు.

గత ఏడాది చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురవడం వల్ల రెండో త్రైమాసికంలో అతి తక్కువ బొగ్గు ఉత్పత్తి జరిగిందని.. ఈ ఏడాది జులైలో కొంత వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి సాఫీగా జరిగేలా చూడాలన్నారు. ఒకవేళ వర్షాలు కురిసినప్పటికీ ఓపెన్ కాస్ట్ గనుల్లో నీటి నిల్వ వల్ల బొగ్గు ఉత్పత్తికికు ఆటకం కలగకుండా ఉండేందుకు ఇప్పటి నుండే భారీ పంపులను గనుల వద్ద ఏర్పాటు చేసుకోవాలని, వర్షపు నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడిపోయాలని పిలుపునిచ్చారు. అలాగే వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్ గనుల్లో రవాణాకు ఆటకం లేకుండా హాల్ రోడ్లను ఎప్పటికప్పుడు పటిష్ట పరుస్తూ నిర్వహించాలన్నారు. భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తిపై వర్షాల ప్రభావం ఉండదు కనుక ఎక్కువ ఉత్పత్తి సాధించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు నుంచి రోజుకు సగటున 7 వేల టన్నులకు తగ్గకుండా బొగ్గు ఉత్పత్తి సాధించాలని సిఎండి శ్రీధర్ ఆదేశించారు. పలు ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన ఓవర్ బర్డెన్ కాంట్రాక్టులను ఇప్పటికే పూర్తి చేశామని, ఏరియాలో జనరల్ మేనేజర్లు నిర్దేశిత లక్ష్యాల మేరకు ఓవర్ బర్డెన్ ను తొలగించేందుకు ఏజెన్సీల పనితీరును పర్యవేక్షించాలన్నారు.

రానున్న వర్షాకాలంలో రోజుకు సగటున కనీసం 14.67 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తీయాలని స్పష్టం చేశారు. జులై నెలలో రోజువారీగా వివిధ ఏరియాలోసాధించాల్సిన బొగ్గు ఉత్పత్తి ,బొగ్గు రవాణా లక్ష్యాలను ఆయన నిర్దేశించారు. కొత్తగూడెం ఏరియా రోజుకు 41 వేల టన్నుల బొగ్గు రవాణా జరపాలని మణుగూరు ఏరియా 40 వేల టన్నులు రామగుండం-2 ఏరియా 24 వేల టన్నులు, శ్రీరాంపూర్ ఏరియా 19 వేల టన్నులు, రామగుండం 3ఏరియా 14,500 టన్నులు, బెల్లంపల్లి 14 వేల టన్నులు, మందమర్రి 12 వేల టన్నులు, రామగుండం 1 ఏరియా 11,500 టన్నులు, భూపాలపల్లి 10 వేల టన్నులు, ఇల్లందు ఏరియా 9 వేల టన్నులు సాధించాలని ఆయన నిర్దేశించారు.
మొదటి త్రైమాసికంలో లక్ష్యాలు సాధించిన సింగరేణి :
ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికం అనగా ఏప్రిల్ నుండి జూన్ వరకు సింగరేణి సంస్థ తాను నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించింది. ఈ కాలానికి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 167 లక్షల టన్నులుగా నిర్దేశించగా దీనిని అధిగమించి 171 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 102 శాతంతో ముందంజలో ఉంది. బొగ్గు రవాణా లక్ష్యం 166 లక్షల టన్నులు కాగా దీనిని అధిగమించి 180 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఓవర్ బర్డన్ తొలగింపు లక్ష్యం 117.6 లక్షల క్యూబిక్ మీటర్లు కాగా దీనిని అధిగమించి 118.3 లక్షల క్యూబిక్ మీటర్లు సాధించి ముందంజలో ఉంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినట్లయితే ఈ మొదటి త్రై మాసికంలో బొగ్గు ఉత్పత్తిలో 1.09 శాతం వృద్ధిని, బొగ్గు రవాణాలో 4.47 శాతం వృద్ధిని, ఓవర్ బర్డెన్ తొలగింపులో 8.91 శాతం వృద్ధిని సింగరేణి సంస్థ నమోదు చేసింది. ఇదే ఒరవడితో ఈ ఏడాది కూడా నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తూ ముందుకు పోవాలని, వార్షిక ఉత్పత్తి లక్ష్యం 750 లక్షల టన్నుల ను అధిగమించాలని సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ (ఫైనాన్స్ పర్సనల్) ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్ వి కే శ్రీనివాస్, డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ ) జి వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వైజర్ (మైనింగ్) డి ఎన్ ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం.సురేష్, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) కె.సూర్యనారాయణ, జనరల్ మేనేజర్( సిపిపి ) జక్కం రమేష్, జనరల్ మేనేజర్ (మెటీరియల్ ప్రొక్యూర్మెంట్) మల్లెల సుబ్బారావు, అన్ని ఏరియా నుంచి ఏరియాలో జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ నుంచి వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News