Sunday, December 22, 2024

వారు వీరవుతున్నారు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఖరారు కావటంతో రానున్న రోజుల్లో వలసలు పెరిగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నుంచి చేరేందుకు కీలక నేతలు ఆసక్తి చూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు మరిన్ని వలసలు కొనసాగే అవకాశం ఉంది. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల్లో వేరే పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు.

ఆ మేరకు ఆయా పార్టీలు ఇప్పటికే కొంతమందికి టికెట్లు ఖరారు చేయగా, మరికొంతమంది త్వరలోనే టికెట్లు ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపి రంజిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల స్థానానికి బరిలో దిగగా, బిఎస్‌పి నుంచి నాగర్‌కర్నూల్‌లో పోటీచేయాలనుకున్న ఆర్.ఎస్ ప్రవీణ్‌కుమార్ బిఆర్‌ఎస్ నుంచి బరిలో నిలిచారు. అలాగే బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తుండగా, రంగారెడ్డి జెడ్‌పి చైర్మన్ సునీత మహేందర్‌రెడ్డి ఉన్న బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి మల్కాజిగిరి స్థానం బరిలో దిగారు. జహీరాబాద్ సిట్టింగ్ ఎంపి బీబీ పాటిల్ బిఆర్‌ఎస్ నుంచి బిజెపిలో చేరి అదేస్థానం నుంచి బిజెపి తరపున పోటీ చేయనుండగా, బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బిజెపి చేరగా ఆయన కుమారుడు భరత్ ప్రసాద్‌ను ఎంపీ బరిలో నిలిపారు. అదేవిధంగా, బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ సైదిరెడ్డి బిజెపిలో చేరిన ఆ పార్టీ తరపున నల్గొండ స్థానానికి పోటీ చేస్తుండగా, బిఆర్‌ఎస్ నుంచి బిజెపి చేరిన గోండు నగేష్ అదిలాబాద్ లోక్‌స్థానం నుంచి బరిలోకి దిగారు. మాజీ ఎంపి సీతారాంనాయక్ బిఆర్‌ఎస్ నుంచి బిజెపిలోకి వెళ్లి ఆ పార్టీ తరపున మహబూబాబాద్ స్థానం పోటీ చేస్తున్నారు. ఆ మేరకు ఇటీవల పార్టీ మారిన నేతలకు ఆయా పార్టీలు టికెట్లు ఖరారు చేశాయి. బిఆర్‌ఎస్ ఎంపీగా గెలిచిన జితేందర్‌రెడ్డికి గత పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్ధిత్వం దక్కకపోవడంతో బిజెపిలో చేరారు. ఈసారి అక్కడ అభ్యర్ధిత్వం దక్కకపోవడంతో మరోసారి పార్టీ మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ బిజెపి అభ్యర్ధిగా పోటీచేసిన కుమారుడు మిథున్‌రెడ్డితో కలిసి జితేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. జితేందర్ రెడ్డికి ఢిల్లీలో రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదా ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించింది.

మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అనుచరగణంతో బిఆర్‌ఎస్ పార్టీని వీడి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. స్వర్ణ సుధాకర్ గతంలో ఎంఎల్‌ఎ పనిచేశారు. వివిధ పార్టీలనుంచి టికె్‌ట్ ఆశించి భంగపడ్డ నేతలు, రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లో చేరుతున్నారు. రాజకీయ నేతల పార్టీల మార్పుతో రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఎప్పుడు ఎవరు పార్టీ మారతారో ఎవరు పార్టీలో ఉంటారో ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలకే తెలియడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థి పార్టీల్లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బిజెపి పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీల్లో మరికొంత బలమైన నాయకులు చేరుతారనే ప్రచారం జరుగుతోంది. నేతలు పార్టీలు మారుతుండటంతో ఆయా పార్టీల కేడర్ కొత్త నేతలకు ఎంతవరకు సహకరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News