Monday, December 23, 2024

గుడికి వెళ్తే బిజెపిలో చేరినట్లా?: మాజీ మంత్రి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ బహుజనుల పార్టీ గనుకే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రలోభాలకు లొంగకుండా, భారత రాష్ట్ర సమితిలోకి చేరారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాను బిజెపిలోకి చేరుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమన్నారు. గుడికి వెళ్తే బిజెపిలో చేరినట్లా అని ప్రశ్నించారు. తానేంటో బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు తెలుసని పేర్కొన్నారు. కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

బిఆర్‌ఎస్‌లో బహుజన నాయకత్వం బలంగా ఉందని, బిఆర్‌ఎస్ బహుజన నాయకులను కాంగ్రెస్ పార్టీ లోబరుచుకునే ప్రయత్నం చేస్తోందని వారు ఆరోపించారు. ప్రలోభాలు పెట్టినప్పటికీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ లొంగలేదని తెలిపారు. బిఆర్‌ఎస్ పార్టీ బహుజనుల కోసం పోరాడుతుందనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బిఆర్‌ఎస్‌లో చేరారని పేర్కొన్నారు. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీలోకి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు ఆయన స్వాగతం పలికారు. బిఆర్‌ఎస్ పార్టీలా దేశంలో బహుజనుల కోసం పోరాడిన పార్టీ ఉన్నదా..? అని ఆయన ప్రశ్నించారు. అంబేడ్కర్ సిద్ధాంతాలను తూచ తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ బిఆర్‌ఎస్ పార్టేనని పేర్కొన్నారు.

పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేది లేదు
అధికారంలో ఉన్నప్పుడు లాభపడి, స్వార్థం కోసం ఇప్పుడు కొందరు పార్టీని వీడుతున్నారని, పార్టీని వీడి వెళ్లిన వారిని తిరిగి రానిచ్చేదిలేదని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బహుజనులను అంతం చేయాలని కొన్ని పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. మూడు నెలలుగా బహుజన నాయకులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వారిని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని కులాలను ఆదుకునేది కెసిఆర్ ఒక్కరే అని ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఉద్యమాన్ని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని ముందడుగు వేశామని తెలిపారు. ఆ రోజుల్లో బెదిరించినా భయపడకుండా పోరాటాలు చేశామని గుర్తు చేశారు.

ఎంతోమంది తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వాన్ని అణచివేయాలని చూశారన్నారు. తెలంగాణ గడ్డపై ఎన్నో ఉద్యమాలు పుట్టాయని.. రాబోయే రోజుల్లో బహుజన ఉద్యమం కూడా పుట్టబోతుందని తెలిపారు. బహుజనులకు అండగా ఉండే పార్టీ బిఆర్‌ఎస్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కుట్రలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని అన్నారు. కొందరు పార్టీ నుంచి లాభం పొంది ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌ను టార్గెట్ చేయడంలో భాగంగానే కవితను అరెస్టు చేశారని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రతి పక్షాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కచ్చితంగా మరోసారి పెద్ద పోరాటం మొదలవుతుందన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం తెలుస్తోందన్నారు. రాబోయే ఐదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్సే అని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News