- మా ప్రభుత్వ లక్షం సమ్మిళిత అభివృద్ధి
- ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ నిశిత విమర్శ
- వారణాసిలో రూ. 3880 కోట్లతో 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన
వారణాసి : ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రతిపక్షాలను తీవ్ర స్థాయిలో తూర్పారపడుతూ అధికారం కోసం వెంపర్లాదే వారి దృష్టి తమ సొంత కుటుంబాలను ప్రోత్సహించుకోవడంపైనే ఉంటుందని, కానీ తన ప్రభుత్వం సమ్మిళిత అభివృద్ధి ధ్యేయంతో కృషి చేస్తుంటుందని చెప్పారు. వారణాసిలో రూ. 3880 కోట్లు విలువ చేసే 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభికులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ‘దేశ సేవలో మాకు మార్గం చూపే మంత్రం ఎల్లప్పుడూ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’. ఇదే స్ఫూర్తితో మేము ప్రతి పౌరుని పరిస్థితి మెరుగుదల కోసం ముందుకు సాగుతూనే ఉంటాం’ అని ఉద్ఘాటించారు. ఇందుకు విరుద్ధంగా అధికార లాలస ఉన్నవారు రేయింబవళ్లు రాజకీయ క్రీడలు ఆడుతుంటారని, జాతీయ ప్రయోజనాల దృష్టితో కాకుండా కుటుంబ ఆధారిత మద్దతు, కుటుంబం కేంద్రంగా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించి వారు సాగుతుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన పార్లమెంటరీ నియోజకవర్గంలో సభలో మాట్లాడుతూ, ‘అధికారం కైవసం కోసం రాత్రింబవళ్లు ఆటలు ఆడుతుండేవారి సూత్రం ‘పరివార్ కా సాథ్, పరివార్ కా వికాస్ (కుటుంబ మద్దతు, కుటుంబ వికాసం)’ అని ఆరోపించారు. భోజ్‌పురిలో ప్రజలకు శుభాకాంక్షలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ దళిత సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా ఆయన నివాళి అర్పించారు. సాంఘిక సమానత్వానికి, మహిళా సాధికారతకు ఆయన చేసిన కృషిని మోడీ గుర్తు చేశారు. సర్వతోముఖాభివృద్ధిపై తన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని పునరుద్ఘాటిస్తూ, ‘కొత్త శక్తితో వారి సిద్ధాంతాలను మేము ముందుకు తీసుకువెళుతున్నాం’ అని ఆయన చెప్పారు. తన నియోజకవర్గంలో కనిపించిన అభివృద్ధి గురించి మోడీ వివరిస్తూ, లోగడ పూర్వాంచల్‌లో ఆరోగ్య సౌకర్యాల లోటు ఉండేదని, కాని ఇప్పుడు కాశీ ఆరోగ్య రాజధానిగా మారుతోందని చెప్పారు. ‘దాదాపు 10, 11 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో వైద్య చికిత్స పొందడంలో సమస్యలు ఉంటుండేవి. ఇప్పుడు మన కాశీ ఆరోగ్య రాజధానిగా కూడా రూపుదిద్దుకుంటోంది. ఢిల్లీ, ముంబయికి చెందిన పెద్ద ఆసుపత్రులు ఇప్పుడు ఈ ప్రాంతంలోని ప్రజలకు అందుబాటులోకి రావడమే కాకుండా రోగుల పట్ల మర్యాద కూడా పాటిస్తున్నాయి’ అని మోడీ వారణాసిలో పలు ప్రముఖ ఆసుపత్రుల శాఖల ఏర్పాటు గురించి ప్రస్తావిస్తూ చెప్పారు. గత దశాబ్దంలో నగర పరివర్తన ప్రస్థానాన్ని మోడీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, ‘గడచిన పది సంవత్సరాల్లో బెనారస్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. కాశీ సదా తన వారసత్వాన్ని పరిరక్షించుకుని, సముజ్వల భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు కాశీ కేవలం ప్రాచీనమైనది కాదు, కానీ నా కాశీ ప్రగతిశీలకమైనది’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కృషి గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ, ‘ఈరోజు కాశీ పూర్వాంచల్ వికాస రథాన్ని నడుపుతోంది’ అని చెప్పారు. ‘ఇప్పుడు భారత్ అభివృద్ధి, వారసత్వ సంపద కలగలిపి ముందుకు సాగుతోంది, మన కాశీఇందుకు అత్యుత్తమ నమూనా’ అని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ ఆత్మ ఈ విభిన్నతలోనే వసిస్తుంటుంది, కాశీ దీని అత్యంత రమణీయ దృశ్యం’ అని ఆయన అన్నారు. జాతీయ సమైక్యతను పటిష్ఠం చేయడానికి దోహదం చేసే కాశీ తమిళ్ సంగమం వంటి పథకాల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆర్థిక రంగంలో ఉత్తర ప్రదేశ్ పరివర్తనను ప్రధాని మోడీ ప్రధానంగా ప్రస్తావించారు. ‘ఉత్తర ప్రదేశ్ ఇక ఎంత మాత్రం అవకాశాల ప్రదేశం కాదు. అది ఇప్పుడు సత్తా ఉన్న, దృఢ సంకల్పం ఉన్న భూమి కూడా’ అని ఆయన పేర్కొన్నారు. ‘భారత్ తయారీ’ ఉత్పత్తులు ప్రపంచ గుర్తింపు ఎలా పొందుతున్నాయో ఆయన వివరించారు. ‘ఇప్పుడు యుపి సమస్త దేశానికి జియో ట్యాగింగ్‌లో నంబర్ వన్. అంటే మన సంస్కృతి, మన విషయాలు, మన నైపుణ్యాలు శీఘ్రంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతున్నాయని అర్థం’ అని ఆయన తెలిపారు. వారణాసి, పరిసర జిల్లాలకు చెందిన డజన్ల కొద్తీ ఉత్పత్తులు జిఐ ట్యాగ్‌లు పొందాయని, వాటిలో నగరానికి చెందిన ప్రసిద్ధ తబలా, షెహనానయి, కుడ్య చిత్రాలు, ఎర్ర పేడా, బర్ఫీ వంటివి కూడా ఉన్నాయని మోడీ తెలియజేశారు. 2036 ఒలింపిక్స్‌ను భారత్‌లోనే నిర్వహించేలా చూసేందుకు తన ప్రభుత్వం పాటుపడుతోందని కూడా మోడీ తెలిపారు. భవిష్యత్తులోకి పురోగమిస్తూనే కాశీ పురాతన ఆత్మను పరిరక్షించాలన్న పిలుపుతో తన ప్రసంగాన్ని మోడీ ముగించారు. మోడీ శంకుస్థాపన చేసిన పథకాల్లో గ్రామీణాభివృద్ధి లక్షంగా చేసుకున్నవీ ఉన్నాయి. వాటిలో 130 మంచినీటి ప్రాజెక్టులు, 100 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు, 356 గ్రంథాలయాలు, పింద్రాలో ఒక పాలిటెక్నిక్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నాయని వారణాసి డివిజనల్ కమిషనర్ కౌశల్ రాజ్ శర్మ తెలియజేశారు. ప్రధాని రామ్‌నగర్‌లో పోలీస్ బ్యారక్స్, పోలీస్ లైన్స్‌లో ఒక ట్రాన్సిట్ హాస్టల్‌కు, నాలుగు గ్రామీణ రోడ్లకు కూడా ప్రారంభోత్సవం చేశారు. ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో ఉన్నారు.