Sunday, January 5, 2025

టికెట్ల విక్రయంతో తమకు సంబంధం లేదు

- Advertisement -
- Advertisement -

They have nothing to do with ticket sales

హెచ్‌సిఎ అధ్యక్షుడు అజారుద్దీన్

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఆదివారం భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టి20 మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల అమ్మకానికి హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని హెచ్‌సిఎ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి టికెట్ల విక్రయం బాధ్యతను పెటిఎంకు అప్పగించడం జరిగిందని, దీంతో ఈ విషయంలో జరిగిన అక్రమాలకు హెచ్‌సిఎ ఎలాంటి బాధ్యతలు వహించదని అజారుద్దీన్ తేల్చి చెప్పారు. ఇక పెటిఎం సంస్థ కూడా తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించిందని, టికెట్ల అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని అజారుద్దీన్ పేర్కొన్నారు. ఇక టికెట్ల అమ్మకానికి సంబంధించి హెచ్‌సిఎపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇవన్నీ కొందరు కావాలని చేస్తున్న ఆరోపణలేనని కొట్టి పారేశారు. ఇక టికెట్లను బ్లాక్‌లో అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎంత పెద్ద వారినైనా తాము విడిచిపెట్టే ప్రసక్తే లేదని అజారుద్దీన్ స్పష్టం చేశారు.

సవాల్ వంటిదే..

మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుందని, దీన్ని సజావుగా నిర్వహించడం తమకు సవాల్ వంటిదేనని పేర్కొన్నారు. హెచ్‌సిఎ సభ్యులందరూ మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇక ఏ క్రికెట్ సంఘానికైనా అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణ సవాల్‌గానే ఉంటుందన్నారు. అయినా తమ దృష్టంతా మ్యాచ్‌ను సక్సెస్ చేయడంపైనే కేంద్రీకరించామని అజారుద్దీన్ స్పష్టం చేశారు. హెచ్‌సిఎ కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ తమ దృష్టంతా మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడంపైనే కేంద్రీకరించామన్నారు. మ్యాచ్ కోసం హెచ్‌సిఎ పాలక మండలి సభ్యులు విభేదాలను పక్కనబెట్టి ఒక్కటయ్యామన్నారు. కాగా టికెట్ల అమ్మకాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. ఈ విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. చాలా ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో మ్యాచ్ జరుగుతుండడంతో టికెట్ల కోసం విపరీత డిమాండ్ ఏర్పడిందన్నారు. దీంతో టికెట్ల అమ్మకం వ్యవహారం గందరగోళంగా మారిందన్నారు. ఇక జింఖానా మైదానంలో జరిగిన తొక్కిసలాటను దురదృష్టకర సంఘటనగా పేర్కొన్నారు.

దీనికి హెచ్‌సిఎ చింతిస్తుందన్నారు. కాగా, హైదరాబాద్ ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు వేదికగా నిలవడం తమకు గర్వంగా ఉందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు విజయానంద్ వివరించారు. కొవిడ్ కారణంగా ఉప్పల్‌లో చాలా ఏళ్లుగా ఎలాంటి మ్యాచ్‌లు జరుగలేదని, దీంతో స్టేడియంలో కుర్చీలు దుమ్ముపట్టాయన్నారు. వీటిని మ్యాచ్ ప్రారంభం నాటికి పూర్తిగా శుభ్రం చేస్తామన్నారు. ఇక మ్యాచ్‌ను ఎలాంటి ఆటంకం లేకుండా సాఫీగా నిర్వహించేందుకు హెచ్‌సిఎ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. కాగా, కొందరు పనిగట్టుకుని హెచ్‌సిఎపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో తాము మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా కొందరు అర్థంపర్థంలేని విమర్శలకు దిగడం సరికాదన్నారు. ఇక టికెట్లను బ్లాక్‌లో అమ్మే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజయానంద్ హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News