Wednesday, January 22, 2025

రష్యాలో రక్తపాతం చూడాలనుకున్నారు

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యా అంతర్గత ఘర్షణలతో రక్తపాతం చోటు చేసుకోవాలని పాశ్చాత్య దేశాలు, ఉక్రెయిన్ కోరుకున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. తిరుగుబాటు చల్లారిన తర్వాత ఆ దేశాధ్యక్షుడు పుతిన్ తొలిసారి టెలివిజన్‌లో సందేశం ఇచ్చారు. తాను రక్తపాతాన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నానని ఆయనచెప్పారు. ఈ క్రమంలో వాగ్నర్ గ్రూపునకు క్షమాభిక్ష ప్రసాదించానని ఆయన చెప్పారు.‘ ఈ తిరుగుబాటు మొదలైనప్పటినుంచి కూడా రక్తపాతాన్ని నివారించే దిశగానే నా చర్యలున్నాయి.

రష్యన్ల దేశభక్తికి ధన్యవాదాలు. రష్యన్లు తమ సోదరులను చంపుకోవడమే పాశ్చాత్యులకు, కీవ్‌లోని నియో నాజీలకు, దేశ ద్రోహులకు కావాలి. వారు రష్యా సైనికులు పరస్పరం ప్రాణాలు తీసుకోవాలని కోరుకున్నారు. ఏ విధమైన వ్యవస్థీకృత సంక్షోభానికి చేసే ఏ ప్రయత్నమైనా, బెదిరింపులైనా చివరికి విఫలమవుతాయని ప్రజల సంఘీభావం తెలియజేస్తోంది’ అని పుతిన్ పేర్కొన్నారు. ఈ కుట్రకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అయితే ప్రిగోజిన్ పేరును ఆయన ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం. వాగ్నర్ దళంలోని సగటు సభ్యుడు దేశభక్తుడని ఆయన కొనియాడారు.

‘ఇక మీరు(వాగ్నర్ గ్రూపు సభ్యులు) నేటినుంచి రక్షణ శాఖ కాంట్రాక్ట్ ద్వారా సైన్యంలో చేరవచ్చు.లేదా మీ కుటుంబ సభ్యులు ఆత్మీయుల వద్దకు వెళ్లవచ్చు. ఎవరైనా కోరుకుంటే బెలారస్ కూడా వెళ్లవచ్చు ’ అని పుతిన్ మరో సారి తన ఆఫర్‌ను ప్రకటించారు. మరోవైపు రష్యాపై తాము చేసిన తిరుగుబాటు ప్రభుత్వాన్ని కూలదోయడం కోసం కాదని వాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ఎలా కొనసాగాలో తెలియజెప్పి, నిరసన తెలియజేయడమే తమ ఉద్దేశమని చెప్పారు.

అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ప్రిగోజిన్ సోమవారం టెలిగ్రాం యాప్‌లో దాదాపు 11 నిమిషాల నిడివి కల సందేశాన్ని విడుదలచేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని అసమర్థ రీతిలో రష్యా కొనసాగిస్తోందని, దానిపై నిరసనగానే మాస్కోకు బయలుదేరామని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ప్రిగోజిన్ ఎక్కడ ఉన్నాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ప్రిగోజిన్ ఉపయోగిస్తున్నట్లుగా చెప్తున్న బిజినెస్ విమానం మంగళవారం ఉదయం మిన్స్ సమీపంలో ల్యాండ్ అయినట్లు బెలారస్ మిలిటరీ పర్యవేక్షణలోని ప్రాజెక్ట్ బెలారుస్కి హాజున్‌తెలిపింది. అయితే ఈ వార్తలపై ప్రిగోజిన్ తరఫు మీడియా స్పందించలేదు.

మరో వైపు రష్యా విషయంలో అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి జాన్ కిర్బీ స్పందించారు. అక్కడి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నామని పేర్కొన్నారు. ‘మా ఆందోళనలను దౌత్యమార్గాలద్వారా రష్యా అధికారులకు తెలియజేశాం.. భవిష్యత్తులో కూడా తెలియజేస్తూనే ఉంటాం’ అని ఆయన పేర్కొన్నారు. కాగా మాస్కోలోని తమ రాయబారి లెన్నె ట్రేసీ రష్యా అధికారులతో మాట్లాడారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఇది పూర్తిగా రష్యా అంతర్గత వ్యవహారం. మేము ఇప్పుడు జోక్యం చేసుకోం.. భవిష్యత్తులో కూడా జోక్యం చేసుకోం’అని స్పష్టంగా చెప్పినట్లు తెలిపింది. మరోవైపు ప్రిగోజిన్‌పై క్రిమినల్ దర్యాప్తును మూసివేస్తున్నట్లు రష్యా అధికారులు మంగళవారం ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News