17తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్: ఫంక్షన్లలో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు చోరీ చేస్తున్న ఘరానా దొంగను సరూర్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. మహబూబ్‌నగర్, గొల్లగేరి ఏనుగొండకు చెందిన జాజల లక్ష్మినర్సింహస్వామి అలియాస్ తేజ అలియాస్ లడ్డు జేసిబి ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న నిందితుడు ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో మధ్యలో ఆపివేశాడు. నగరంలోని ఎస్‌విఎస్ ఆస్పత్రిలో కొద్ది రోజులు రేడియాలజీ అసిస్టెంట్‌గా పనిచేశాడు. తర్వాత మహబూబ్‌నగర్‌లోని కోటకద్రకు వెళ్లాడు. అక్కడ జేసిబి ఆపరేటర్‌గా పనిచేశాడు. అక్కడ బావమరిది నిందితుడికి ఎలాంటి సాయం చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు.
తిరిగి నగరానికి వచ్చాడు, ఆర్థికంగా ఇబ్బందులు రావడంతో ఫంక్షన్లలోకి వెళ్లి అక్కడి వారు బిజీగా ఉన్న సమయాన్ని ఉపయోగించుకుని అక్కడి రూముల్లోకి వెళ్లి బ్రీఫ్‌కేసులు, బ్యాగుల్లోని బంగారు ఆభరణాలు, విలువైన గ్యాడ్జెస్‌ను చోరీ చేస్తున్నారు. కాచీగూడలోని నింబోలి అడ్డకు చెందిన బండారి శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. తన సోదరుడి కుమార్తె వివాహానికి సరూర్‌నగర్ పరిధిలోని చంపాపేటలోని ఎపిఆర్ గార్డెన్స్‌కు ఈ నెల 9వ తేదీన వెళ్లాడు. అక్కడ వివాహం జరిగిన తర్వాత తన భార్య బ్యాగులోని బంగారు ఆభరణాలు కన్పించలేదు.దీంతో వెంటనే సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై గతంలో సరూర్‌నగర్, మీర్‌పేట, హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. ఇన్స్‌స్పెక్టర్ సీతారాం, ఎస్సైలు శ్రీనివాసులు నాయక్, తదితరులు పట్టుకున్నారు.