మనతెలంగాణ, హైదరాబాద్ : పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న యువకుడు, రిసీవర్, ఇద్దరు బాలురను తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన 30 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఎడిసిపి తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముషీరాబాద్, బోలక్‌పూర్, ఇందిరా నగర్‌కు చెందిన మహ్మద్ అవైసీ అలీ స్క్రాప్ షాప్‌లో వర్కర్‌గా పనిచేస్తున్నాడు, మరో ఇద్దరు బాలురు, ఎపిలోని కాకినాడ జిల్లాకు చెందిన విత్తనాల శ్రీనివాస్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
గత నెల 25వ తేదీన ఈస్ట్ మారేడుపల్లికి చెందిన వడ్డే బలరాం ఇంటి ఎదుట బుల్లెట్ బైక్‌ను పార్క్ చేసి రాత్రి ఇంట్లో నిద్రించాడు, తెల్లవారిన తర్వాత వచ్చి చూసేసరికి కన్పించలేదు. దీంతో తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. బైక్‌పై అనుమానస్పదంగా అవైసీ అలీ వస్తుండగా పోలీసులు ఆపి తనిఖీ చేశారు. పొంతన లేని సమాధానలు చెప్పడంతో స్టేషన్‌కు తీసుకుని వెళ్లి విచారించగా అన్ని దొంగతనాలు బయటపడ్డాయి. నిందితుడి సమాచారంతో 29బైక్‌లు రిసీవర్, ఇద్దరు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ ఎల్లప్ప, డిఐ ఆంజనేయులు తదితరలు పట్టుకున్నారు.