జగిత్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో చోరీకి పాల్పడింది అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా అని, ఏడుగురి సభ్యుల ముఠాలో ముగ్గురు పట్టుబడినట్లు జిల్లా ఎస్‌పి భాస్కర్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌పి దొంగతనానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 23న రాత్రి ఒంటి గంట సమయంలో నలుగురు దొంగలు అంజన్న ఆలయంలో చొరబడి గర్భాలయంలో ఉన్న సుమారు రూ.9 లక్షల విలువ చేసే 15 కిలోల వెండి సామాగ్రిని దొంగిలించుకుపోయారు. 24న తెల్లవారుజామున స్వామి వారికి పూజలు నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు, ఆలయ అధికారులు దొంగతనం జరిగినట్లు గుర్తించి తమకు ఫిర్యాదు చేశారన్నారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్కాడ్‌ను రంగంలోకి దింపి అన్ని కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేసినట్లు ఎస్‌పి వివరించారు.
10 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కేవలం 24 గంటల్లోనే దొంగల కదలికలను గుర్తించి ముగ్గురు దొంగలను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుంచి 5 కిలోల వెండి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆలయంలో దొంగతనానికి పాల్పడింది కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాకు చెందిన ఏడుగురు సభ్యులతో కూడిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అని ఎస్‌పి వివరించారు. దొంగల ముఠా ఫిబ్రవరి 22న కర్ణాటక నుంచి బయలు దేరి అదే రోజు కొండగట్టుకు చేరుకుందని, భక్తుల వేషంలో ఉన్న వారు సాయంత్రం ఆలయంలో స్వామి వారి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఆ రోజు రాత్రి కొండగట్టు పైనే ఉండి రెక్కి నిర్వహించిన ముఠా మరుసటి రోజు ఉదయం మరోసారి ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు.
అదే సమయంలో ఆలయంలో ఎక్కడెక్కడ ఏఏ వస్తువులు ఉన్నాయని గుర్తించి అదే రోజు రాత్రి ఆలయం వెనుక వైపు నుంచి వచ్చి ఆలయంలోకి చొరబడినట్లు ఎస్‌పి తెలిపారు. ఏడుగురు ముఠా సభ్యుల్లో ముగ్గురు ఆలయంలో వెలుపల కాపలా ఉండగా నలుగురు గోడ దూకి ఆలయంలో చొరబడి ఆలయంలోని స్వామి వారి వెండి మకరతోరణం, వెండి కిరీటం, వెండి శఠగోపాలు, ఆంజనేయ స్వామి వెండి ప్రతిమ, వెండి గొడుగు, వెండితో తయారు చేసిన పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు అమర్చిన వెండి కవచము ముక్కలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. మొత్తం 15 కిలోల వెండి సామాగ్రి చోరికి గురి కాగా, పట్టుబడ్డ దొంగల నుంచి వెండి శఠగోపం, వెండి గొడుగు, వెండి పెద్ద రామరక్ష, రెండు ద్వారాలకు అమర్చిన కవచం ముక్కలు స్వాధీనం చేసుకున్నామని, పట్టుబడ్డ సామాగ్రి 5 కిలోలు ఉండగా వాటి విలువ రూ. 3.50 లక్షల ఉంటుందని తెలిపారు.
మరో 10 కిలోల వెండి మకరతోరణం, స్వామి వారి కిరీటం, శఠగోపాలు, అంజనేయ స్వామి వెండి ప్రతిమ స్వాధీనం చేసుకోవాల్సి ఉందన్నారు. పట్టుబడ్డ వారిలో ఎ1 నిందితుడిగా ఉన్న బాలాజీ కేశవ్ రాథోడ్, ఏ5 నర్సింగ్ జాదవ్, ఏ7 విజయ్‌కుమార్ రాథోడ్‌లు ఉన్నారని, ఏ2 రామారావు జాదవ్, ఏ3 రాంశెట్టి జాదవ్, ఏ4 విక్రమ్ జాదవ్, ఏ6 దేవదాస్ జాదవ్‌లు పరారీలో ఉన్నారని, వారి కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నామని, త్వరలోనే వారిని పట్టుకుని స్వామి వారి వెండి విగ్రహాలను స్వాధీనం చేసుకుంటామని ఎస్‌పి తెలిపారు. ఈ దొంగల ముఠా ఆలయాలను టార్గెట్ చేసి చోరికి పాల్పడటంలో దిట్ట అని, వీరి మీద మహరాష్ట్రలోని పండరీపురంలోని ఆలయంలో చోరికి పాల్పడ్డ కేసు నమోదైందని, అలాగే కర్ణాటక రాష్ట్రంలోని కమాన్‌పూర్‌లో, తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా చాముండేశ్వరి ఆలయంలో చోరికి పాల్పడ్డ కేసులు ఉన్నాయన్నారు.
దొంగలను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు ఎస్‌పి భాస్కర్ తెలిపారు. ఈ సమావేశంలో జగిత్యాల డిఎస్‌పి ఆర్.ప్రకాశ్, మల్యాల సిఐ రమణమూర్తి, కోరుట్ల సిఐ ప్రవీణ్‌కుమార్, సిసిఎస్ సిఐ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.