Friday, November 8, 2024

విమానంలో రూ.260 కోట్ల నగదు… కొట్టేసేందుకు ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి…

- Advertisement -
- Advertisement -

శాంటియాగో: విమానంలో తరలిస్తున్న భారీ మొత్తంలోని నగదును కొల్లగొట్టేందుకు ఓ ఘరానా దొంగల ముఠా విఫలయత్నం చేసింది. సినీ ఫక్కీలో ఎయిర్‌పోర్టులోకి దూసుకొచ్చి డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తం కావడంతో ఈ భారీ ‘మనీ హైయిస్ట్’ను అడ్డుకోగలిగారు. చిలీ రాజధాని శాంటియాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫ్లోరిడా లోని మియామీ నుంచి 32.5 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.262 కోట్లకు పైనే) నగదును ప్రత్యేక విమానంలో బుధవారం చిలీకి తీసుకొచ్చారు.

ఈ విమానం దిగగానే అందులోని డబ్బును ఓ సాయుధ ట్రక్కు లోకి తరలిస్తుండగా ఉన్నట్టుంది ఓ దొంగల ముఠా దాడి చేసింది. వాహనాలతో విమానాశ్రయ గేటును బద్దలు కొట్టి ఆ ముఠా రన్‌వే పైకి చొచ్చుకొచ్చింది. అందులో కొందరు భద్రతా సిబ్బందిపై దాడి చేసి ఆయుధాలు లాక్కున్నారు. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు పోలీసులు వెంటనే వారిపైకి కాల్పులు జరిపారు. దీంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల ఘటనలో పౌరవిమానయాన ఉద్యోగి ఒకరు మృతి చెందగా, నిందితుల్లో ఒకడు హతమయ్యాడు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఘటన తర్వాత డబ్బు సురక్షితంగానే ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, శాంటియాగో ఎయిర్‌పోర్టులో ఇలాంటి ఘరానా దోపిడీలు కొత్తేం కాదు. 2020లోఓ దొంగల ముఠా ఎయిర్‌పోర్టు లోని ఓ గోదాంలో ఉంచిన 15 మిలియన్ డాలర్ల విలువ చేసే వస్తువులను ఎత్తుకెళ్లింది. అంతకు ముందు ఆరేళ్ల క్రితం కూడా 10 మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News