పాట్నా: బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాలోని గ్రామంలో 500 టన్నుల ఇనుముతో 60 అడుగుల పొడవులో నిర్మించిన వంతెనను దొంగలెత్తుకెళ్లారు. ఆ దొంగలు ఎవరో కాదు ప్రభుత్వ అధికారులేనేమో. కాగా దీని మీద నీటి వనరుల శాఖ గుర్తు తెలియని వ్యక్తుల మీద ఏప్రిల్ 8న ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేసింది. 45 ఏళ్ల క్రితం నిర్మించిన అరాసోనే వంతెన ఏప్రిల్ 5న మాయమైందని స్థానిక గ్రామస్థులు గుర్తించారు. జిల్లా ప్రధాన కేంద్రం ససారామ్‌కు ఈ గ్రామం కేవలం 40 కిమీ. దూరంలోనే ఉంది. నీటి వనరుల శాఖ స్థానిక అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ తర్వాత స్థానిక నస్రిగంజ్ పోలీస్ స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తులపై కేసును దాఖలు చేశారు. ఆ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి సుభాష్ కుమార్ వంతెన దొంగతనం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తునకు ఆదేశించారు. వంతెన దొంగతనం తుక్కు ఇనుప స్మగ్లర్లు చేసి ఉంటారని భావిస్తున్నారు. వారి వద్దే వంతెనను కోసే పనిముట్లు ఉంటాయని స్థానికులు భావిస్తున్నారు.