అన్ని కేసులు కేరళలోనే వెలుగులోకి
తిరువనంతపురం: కేరళలో మంకీపాక్స్ కేసులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో కేసు నమోదయింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన మూడు కేసులు కూడా కేరళలోనే వెలుగు చూడడం గమనార్హం. ఈనెల 6న యుఎఇనుంచి మలప్పురం వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిలో మంకీపాక్స్ వైరస్‌ను గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ చెప్పారు. అతడికి జ్వరంగా ఉంండంతో మంజెర్రీలోని వైద్య కళాశాలలో చేర్పించగా 15వ తేదీ తర్వాత మంకీపాక్స్ లక్షణాలు బయటపడినట్లు ఆమె చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని, బాధితుడి కుటుంబం, క్లోజ్ కాంటాక్ట్‌లను పరిశీలనలో ఉంచినట్లు తెలిపారు. అయితే ఈ వ్యాధిపట్ల భయపడాల్సిన పని లేదని, రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు, నిఘాను భారీగా పెంచినట్లు మంత్రి చెప్పారు. తాజా కేసుతో రాష్ట్రంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదయిందని ఆరోగ్య శాఖ కార్యాలయం తెలిపింది. దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదవుతుండడంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమయింది. ఇటీవల ఎయిర్‌పోర్టులు, ఓడరేవులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను మరింత కఠినంగా నిర్వహించాలని అధికారులనుఆదేశించింది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తిని కట్టడి చేసేలా విదేశీ ప్రయాణికులందరికీ కఠిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.