Friday, December 20, 2024

నేడు చివరి వన్డే.. క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న ఆతిథ్య టీమిండియా తాజాగా క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఆదివారం మూడో, చివరి వన్డే జరుగనుంది. ఇప్పటికే టీమిండియా 20 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. ఇక ఆఖరి వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను వైట్‌వాష్ చేయాలని తహతహలాడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు శ్రీలంక కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా గెలిచి కాస్తయిన పరువును దక్కించుకోవాలని భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఘోరంగా ఓడిన లంక రెండో వన్డేలో మాత్రం భారత్‌కు గట్టి పోటీనే ఇచ్చింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు కూడా భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక తిరువనంతపురంలో జరిగే మ్యాచ్‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటున్నాయి.

వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా చివరి వన్డేలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే లక్షంతో పోరుకు సిద్ధమైంది. అయితే బ్యాటింగ్‌లో నిలకడ లోపించడం భారత్‌ను కలవరానికి గురిచేస్తోంది. తొలి వన్డేలో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌లతో పాటు విరాట్ కోహ్లి అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. కానీ రెండో వన్డేలో వీరు ముగ్గురు కూడా విఫలమయ్యారు. అయితే రెండో వన్డేలో కెఎల్ రాహుల్, హార్దిక్, అక్షర్ పటేల్ తదితరులు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పాలి. మరోవైపు లంక కూడా గెలుపే లక్షంగా మ్యాచ్‌కు సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగానే ఉన్నా నిలకడ లోపించడం లంకకు ప్రతికూలంగా మారింది. ఈ మ్యాచ్‌లో మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలని లంక భావిస్తోంది. రెండు జట్లు కూడా విజయంపై కన్నేయడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News