న్యూఢిల్లీ : ప్రఖ్యాత ఇండియన్ ఇనిస్టూట్ ఆఫ్ టెక్నాలజి (ఐఐటి) మూడవ విదేశీ క్యాంపస్ శ్రీలంకలో ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అధికారవర్గాలు ధృవీకరించాయి. గత నవంబర్‌లో శ్రీలంకలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఐఐటి ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. ఈ కీలక ఐటి విద్యాసంస్థ ఏర్పాటు విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఐఐటి మద్రాస్ అధికారవర్గాలతో సంప్రదింపులకు దిగింది. ఉన్నత స్థాయి అధికార బృందం చెన్నై క్యాంపస్‌ను సందర్శించింది. శ్రీలంకలో ఐఐటి ఏర్పాటు విషయంలో ప్రాధమిక చర్చలు జరిపింది. ఇప్పుడు ఇక ముందు జరిగే చర్చల నేపథ్యంలో ఇకపై శ్రీలంకలోని కాండిలో ఐఐటి ఏర్పాటుకు వీలుందని అధికారవర్గాలు తెలిపాయి.
అయితే వెంటనే దీనిని పూర్తి స్థాయి అధికారిక ప్రకటనగా భావించరాదని స్పష్టం చేశారు. టాంజానియా, యుఎఇలలో కూడా ఐఐటి ఏర్పాటుదిశలో ఒప్పందాలు కుదిరాయి. తమ దేశంలోనూ ఐఐటి క్యాంపస్‌ల ఏర్పాటుకు బ్రిటన్ కూడా ముందుకు వచ్చింది. మిడిలిస్టుదేశాల నుంచి కూడా ప్రతిపాదనలు వెలువడుతున్నాయి. పలు దక్షణాసియా దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. విదేశాలలో ఐఐటి క్యాంపస్‌ల ఏర్పాటు విషయం పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 17 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డాక్టర్ కె రాధాకృష్ణన్ సారధ్యం వహించారు. ఈ కమిటీ తన నివేదికను కూడా సమర్పించింది.