Monday, January 20, 2025

మూడో దశ పోలింగ్ 61.45 శాతం

- Advertisement -
- Advertisement -

మూడో దశలో 61.45 శాతం పోలింగ్
పశ్చిమ బెంగాల్‌లో అక్కడకక్కడ హింస
అస్సాంలో అత్యధికంగా 74.86 శాతం పోలింగ్
మహారాష్ట్రలో అత్యల్పంగా 53.63 శాతం పోలింగ్
ఓటు వేసిన ప్రధాని మోడీ, అమిత్ షా, ప్రహ్లాద్ జోషి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో చెదురుమదురు హింసాత్మక సంఘటనలు మినహా లోక్‌సభ ఎన్నికల మూడవ దశ పోలింగ్ మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని 93 లోక్‌సభ నియోజకవర్గాలలో జరిగిన ఎన్నికలలో 61.45 శాతం పోలింగ్ నమోదైంది. అస్సాంలో అత్యధికంగా 74.86 శాతం పోలింగ్ నమోదు కాగా తరువాతి స్థానంలో 73.93 శాతంతో పశ్చిమ బెంగాల్ నిలిచింది. మహారాష్ట్రలో అత్యల్పంగా 53.63 శాతం పోలింగ్ నమోదు కాగా 56.01 శాతం ఓటింగ్ శాతంతో బీహార్ కొంత మెరుగ్గా ఉంది. ఉదయం 7 గంటలకు ప్రారంభన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు చాలాచోట్ల ముగిసింది. మూడవ దశ ఎన్నికలలో మొత్తం 17.24 కోట్ల మంది ఓటర్లు ఉండగా వీరిలో 8.39 కోట్ల మంది మహిళలు. గుజరాత్‌లోని 25 లోక్‌సభ స్థానాలలో 55.22 శాతం ఓటింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పోటీ చేస్తున్న గాంధఋనగర్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

అమిత్ షా అహ్మదాబాద్‌లో ఓటు వేశారు. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మాన్సుఖ్ మాండవీయ(పోర్బందర్), పరషోత్తమ్ రూపాల(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి(ధార్వాడ్), ఎస్‌పి సింగ్ బఘేల్(ఆగ్రా) నుంచి బరిలో దిగారు. ఉత్తర్ ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులు పలువురు సమాజ్‌వాది అభ్యర్థులు గా పోటీలో ఉన్నారు. 10 స్థానాలలో 55.13 శాతం ఓటింగ్ నమోదైంది. తన భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్న మెయిన్‌పురి నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లను లూటీ చేయడానికి బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసు స్టేషన్లలో బంధించారని ఆయన తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో 66.87 శాతం పోలింగ్ నమోదైంది.

దాద్రా, నగర్ హవేలీ, దామన్ అండ్ డయ్యూలో 65.23 శాతం, గోవాలో 72.52 శాతం, కర్నాటకలో 66.05 శాతం, మధ్యప్రదేశ్‌లో 62.28 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఇసి తెలిపింది. పశ్చిమ బెంగల్‌లోని నాలుగు నియోజకవర్గాలలో అక్కడక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముర్షిదాబాద్, జాంగిపూర్ స్థానాలలో టిఎంసి-బిజెపి, కాంగ్రెస్‌సిపిఎంకూటమి కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు. ముర్షిదాబాద్‌లో అత్యధికంగా 76.49 శాతం ఓటింగ్ నమోదు కాగా.. మాల్డాహా దక్షిణ్‌లో 73.68 శాతం, మాల్డాహా ఉత్తర్‌లో 73.30 శాతం, జాంగీపూర్‌లో 72.13 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ హింస, ఓటర్లకు బెదిరింపులు, పోలింగ్ ఏజెంట్లపై దాడులకు సంబంధించి టిఎంసి-బిజెపి, కాంగ్రెస్‌సిపిఎం కూటమి కార్యకర్తలు వేర్వేరుగా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

ఉదయం 9 గంటల లోపే ఇసికి 182 ఫిర్యాదులు అందగా వీటిలో అత్యధికం ముర్షీదాబాద్, జాంగీపూర్ నియోజకవర్గాల నుంచే ఉన్నాయి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో 51.53 శాతం పోలింగ్ నమోదు కాగా ఆన్లాలో 54.73 శాతం, బుడౌన్‌లో 52.77 శాతం, బరేలీలో 54.21 శాతం, ఎటాలో 57.07 శాతం, ఫతేపూర్ సిక్రీలో 54.93 శాతం, ఫిరోజాబాద్‌లో 56.27 శాతం, హత్రాస్‌లో 53.54 శాతం, మెయిన్‌పురిలో 55.88 శాతం, సంభల్‌లో 61.10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఇసి తెలిపింది. యుపిలోని కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగినట్లు ఇసికి ఫిర్యాదులు అందాయి. తమకు రోడ్డు వేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చనందుకు నిరసనగా బుడౌన్లోని ధోరన్‌పూర్ గ్రామస్తులు పోలింగ్‌ను బహిస్కరించారు. తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఫిరోజాబాద్‌లోని మూడు గ్రామాల ప్రజలు కూడా పోలింగ్‌ను బహిష్కరించారు.

కర్నాటకలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, మాజీ ముఖ్యమంత్రి బిఎస్ ఎడిచూరప్ప, ఆయన కుమారులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర, షిమోగ లోక్‌సభ అభ్యర్థి బివై రాఘవేంద్ర, కోడళ్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్నాటకలో పోలింగ్ విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు అధికారులు గుండెపోటుతో మరణించినట్లు ఇసి వర్గాలు తెలిపాయి. గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో౬ ఒక పోలింగ్ బూత్ వద్ద డ్యూటీలో ఉన్న కౌశిక బబరియా అనే 45 ఏళ్ల పోలింగ్ అధికారిణి కూడా గుండెపోటుతో మరణించారు. మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్‌సిపి(శర్ పవార్) అభ్యర్థిగా పోటీ చేస్తున్న శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలెకి ప్రత్యర్థిగా బరిలో ఉన్న ఎన్‌సిపి(అజిత్ పవార్) అభ్యర్థిని, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బాలెగావ్‌లోని పోలింగ్ బూత్ వద్ద శరద్ పవార్‌కు సాంప్రదాయ హారతితో మహిళలు స్వాగతం పలికారు. అస్సాంలోని నాలుగు నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి బిశ్వ శర్మ, తన భార్య రినికి భుయాన్ శర్మ, కుమార్తె సుకమ్య శర్మతో కలసి బారత్‌పేట లోక్‌సభ స్థానంలోని అమిన్‌గావ్‌లో ఓటు వేశారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలలో మొదటి రెండు దశలలో 189 స్థానాలకు ఓటింగ్ పూర్తి కాగా మంగళవారం మూడవ దశలో 93 స్థానాలలో పోలింగ్ జరిగింది. మిగిలిన నాలుగు దశలు మే 13, మే 20, మే 25, జూన్ 1న ఎన్నికలు జరుపుకుంటాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News