న్యూఢిల్లీ : తన ప్రభుత్వ మూడవ విడతలో పని వేగం మూడింతలైనట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం వెల్లడించారు. ‘విధాన స్తంభన’ దశ నుంచి ఆర్థిక వ్యవస్థ ఉద్ధరణకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో కృషి చేసిందని ఆమె తెలియజేశారు. లోక్‌సభ చాంబర్లో సమీకృతమైన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ, ప్రధాన నిర్ణయాలు, విధానాలు అసాధారణ వేగంతో అమలు అవుతుండడాన్ని దేశం చూస్తున్నట్లు, నిరుపేదలు, మధ్య తరగతివారు. యువజనులు, మహిళలు, రైతులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు.
‘భారత అభివృద్ధి ప్రస్థానం అనే ఈ అమృత కాల్లో కనివిని ఎరగని విజయాల ద్వారా కొత్త శక్తిని నా ప్రభుత్వం పాదుకొల్పుతున్నది.ఈ మూడవ విడత పని వేగం మూడింతలైంది’ అని ముర్ము తన 60 నిమిషాల ప్రసంగంలో తెలియజేశారు. ఆమె ప్రసంగ సమయంలో ప్రతిపక్షాల నుంచి మధ్య మధ్యలో నిరసనలు వ్యక్తం అయ్యాయి. ప్రతి సంవత్సరం పార్లమెంట్ తొలి సెషన్‌కు ముందు ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో రాష్ట్రపతి ప్రభుత్వ లక్షాన్ని విశదం చేస్తారు. ప్రసంగాన్ని విధాన ప్రకటనగా పరిగణిస్తుంటారు. కీలక అంశాలపై ప్రభుత్వ అభిప్రాయాలను కూడా రాష్ట్రపతి ప్రసంగం స్థూలంగా పేర్కొంటుంటుంది.
అది భవిష్యత్తుకు విస్తృత రోడ్‌మ్యాప్‌ను కూడా సూచిస్తుంటుంది. మౌని అమావాస్య సందర్భంగా బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం వద్ద దేశం అంతటి నుంచి వచ్చిన ల క్షలాది మంది భక్తులు సమీకృతమైనప్పుడు సంభవించిన తొక్కిసలాటలో అనేక మంది భక్తుల మరణం పట్ల ముర్ము తన ప్రసంగం ప్రారంభానికి ముందు నివాళుల అర్పించారు. ఇటీవల కన్నుమూసిన మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు కూడా ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. మూడు కోట్ల అదనపు కుటుంబాల కోసం ఇళ్ల నిర్మాణం, ఆదివాసీల సంక్షేమం, గ్రామీణ ప్రజలకు ఆస్తి కార్డుల జారీ, గ్రామీణ రహదారుల నిర్మాణం, 70 ఏళ్లు దాటిన ఆరు కోట్ల మంది పౌరులకు ఆరోగ్య బీమా పథకం వర్తింపు మొదలైన ప్రభుత్వ విజయాలను ముర్ము వివరించారు.
‘ఒక దేశం ఒక ఎన్నిక’, ‘వక్ఫ్ చట్టం సవరణ’ వంటి కీలక అంశాలపై ప్రభుత్వం వేగంగా పురోగతి సాధించింది’ అని ఆమె తెలియజేశారు. ప్రపంచ అస్థిరత వాతావరణంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ సుస్థిరత మూల స్తంభంగా భారత్ ప్రపంచానికి ఒక ప్రతీకగా నిలుస్తున్నదని ఆమె స్పష్టం చేశారు. భారత ‘బలం, విధానం, సంకల్పం’లో ప్రపంచం తన ‘నమ్మకాన్ని’ నిలిపిందని ముర్ము తెలిపారు. ఆమె ఈ సందర్భంగా క్వాడ్, బ్రిక్స్, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ), జి20 వంటి కీలక సంస్థల గురించి ప్రస్తావించారు. భారత సరిహద్దుల రక్షణ, అంతర్గత భద్రత కోసం ప్రభుత్వం ‘చరిత్రాత్మక’ పథకాలు చేపట్టిందని, స్వావలంబన సాధనలో ముఖ్యంగా రక్షణ రంగంలో ‘అత్యంత ప్రోత్సాహకర ఫలితాలు’ కానవచ్చాయని రాష్ట్రపతి తెలియజేశారు.
శ్రీహరికోటలో రోదసి నౌక ప్రయోగ కేంద్రం నుంచి 100 ప్రయోగాలు నిర్వహించినందుకు ఇస్రోను ముర్ము కొనియాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన గగన్‌యాన్ రోదసి నౌకలో ఒక భారతీయ పౌరుడు రోదసి యాత్ర చేసే రోజు ఎంతో దూరంలో లేదని రాష్ట్రపతి స్పష్టం చేశారు. ‘విధాన స్తంభన దశ నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు నా ప్రభుత్వం డృఢ చిత్తంతో కృషి చేసింది. కొవిడ్19, తదనంతర పరిణామాలు, యుద్ధ సంబంధిత అనిశ్చితులు వంటి ప్రపంచవ్యాప్త ఆందోళనలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ గణనీయ సుస్థిరతను, పుంజుకోగల లాఘవాన్ని ప్రదర్శించి, తన బలాన్ని నిరూపించింది’ అని ఆమె చెప్పారు. వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహించేందుకు అనేక గణనీయ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అమలు జరిపిందని, ‘ఒక దేశం ఒక పన్ను’ స్ఫూర్తితో జిఎస్టి విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, అది దేశవ్యాప్తంగా రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉందని రాష్ట్రపతి తెలియజేశారు.
సమాజంచిట్టచివరన నిల్చున్న వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందినప్పుడే అది నిజంగా అర్థవంతమైన అభివృద్ధి అవుతుందని రాష్ట్రపతి అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం, ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద 10 కోట్ల ఉచిత ఎల్పిజి కనెక్షన్లు, 80 కోట్ల మంది ఆపన్నులైన పౌరులకు రేషన్, సౌభాగ్య యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు నిరుపేదలకు గౌరవంతో జీవించగమనే నమ్మకాన్ని కలిగించాయని ఆమె తెలిపారు. ‘నిరుపేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని సమకూర్చినప్పుడు అది పేదరికంపై పోరాటం సాగించేలా వారికి సాధికార భావనను కలిగిస్తుంది. అటువంటి కృషి ద్వారా 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించి, జీవితంలో ముందుకు సాగుతున్నారు.
వారు నవ మధ్య తరగతిగా రూపుదిద్దుకున్నారు. అది భారత వృద్ధి ప్రస్థానంలోకి కొత్త శక్తిని పాదుకొల్పుతున్నది’ అని ఆమె చెప్పారు. డిజిటల్ ఫ్రాడ్, సైబర్ క్రైమ్, డీప్ ఫేక్స్ వంటి వినూత్న టెక్నాలజీలు భారత సాంఘిక, ఆర్థిక, జాతీయ భద్రతకు సవాళ్లు విసురుతున్నాయని ముర్ము చెప్పారు. ప్రభుత్వం బహుళ విధ, సమ్మిళిత అభివృద్ధి విధానాలపై నిరంతరం కృషి చేసిందని ఆమె ఉద్ఘాటించారు. ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో నూతన పురోగతి అధ్యాయాలు రచించిందని. వాటిలో ఒకటి భారత డిజిటల్ విప్లవ బంగారు మైలురాయి అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్ డిజిటల్ టెక్నాలజీ రంగంలో ప్రధాన ప్రపంచ శక్తిగా ఆవిర్బవించిందని ఆమె స్పష్టం చేశారు. ‘ఇతర ప్రముఖ దేశాలతో పాటు భారత్‌లో 5జి సేవలు ప్రారంభించడం ఈ ప్రస్థానంలో గణనీయమైన మైలురాయిగా నిలుస్తోంది.
భారత యుపిఐ టెక్నాలజీ అభివృద్ధి చెందిన పెక్కు దేశాలను ముగ్ధులను చేసింంది. ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ లావాదేవీల్లో 50 శాతం పైగా ఇప్పుడు భారత్‌లో చోటు చేసుకుంటున్నాయి’ అని ముర్ము తెలియజేశారు. ‘నా ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీని సాంఘిక న్యాయానికి, సమానత్వానికి ఒక సాధనంగా వినియోగించింది. డిజిటల్ చెల్లింపులు ఇక ఎంత మాత్రం ఏ కొందరు వ్యక్తులకో లేక వర్గాలకో పరిమితం కావడం లేదు. ఇప్పుడు భారత్‌లో అతి చిన్న దుకాణదారు కూడా ఈ సౌకర్యం నుంచి లబ్ధి పొందుతున్నాడు’ అని రాష్ట్రపతి తెలిపారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి ముందు ఆమెకు పార్లమెంట్ ప్రాంగణంలో ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓమ్ బిర్లా, ‘సెంగోల్’ను తెచ్చిన అధికారి స్వాగతం పలికారు. ఆరు అశ్వాలు పూన్చిన బగ్గీలో రాష్ట్రపతి చేరుకున్నారు. ఆమె వెంట ఆశ్విక దళ రాష్ట్రపతి అంగరక్షకులు ఉన్నారు. ఆమెకు పార్లమెంట్ భవనం పచ్చిక బయలులో గౌరవ వందనం సమర్పించారు. ఆమెను లోక్‌సభ చాంబర్లోకి ధన్‌ఖడ్, మోడీ, ఓమ్ బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తోడ్కొని వెళ్లారు.