Wednesday, January 22, 2025

తిరుమలలో 17 నుండి తిరుప్పావై పారాయణం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్బంగా డిసెంబరు 17 నుండి 2024 జనవరి 14వ తేదీ వరకు పెద్ద జీయ్యర్ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పెరియ కోయిల్ కేల్విఅప్పన్ శఠగోప రామానుజ పెద్ద జీయర్ స్వామి మఠంలో నెల రోజుల పాటు ఉదయం 7 నుండి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు. ఈ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవద్ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్ద జీయర్ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయర్ స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.

కపిలేశ్వరాలయంలో ముగిసిన రుద్రయాగం
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 11 రోజుల పాటు జరిగిన శ్రీ కపిలేశ్వరస్వామివారి హోమం (రుద్రయాగం) సోమవారం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయంలో హోమ మహోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉదయం రుద్రయాగం సమాప్తి, మహాపూర్ణాహుతి, మహాశాంతి అభిషేకం, కలశ ఉద్వాసన, శ్రీ కపిలేశ్వరస్వామి మూలవర్లకు కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనుంది. తరువాత రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు శ్రీ చండికేశ్వరస్వామివారి కలశ స్థాపన, కలశ ఆరాధన, హోమం నిర్వహించనున్నారు. డిసెంబరు 12న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనుంది. ఈ కార్యక్రమంలో టిటిడి ఈఓ ఎవి.ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఏఈఓ సుబ్బరాజు, సూపరింటెండెంట్ భూపతి, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News