చెన్నై: మద్యంలో మత్తులో తల్లి, పెద్దమ్మను వేధించడంతో కుమారుడిపై మరిగిన నూనె పోసి హత్య చేసిన సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా వందవాసి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తెన్నాంగూరు గ్రామంలో సురేష్(35) అనే వ్యక్తి తన తల్లి రుక్మిణి , పెద్దమ్మ మునియమ్మతో కలిసి ఉంటున్నాడు. సురేష్ మద్యానికి బానిస కావడంతో ఎవరూ అతడికి పిల్లనివ్వడానికి ముందుకు రావడంలేదు. ప్రతీ రోజు మద్యం తాగొచ్చి ఇంట్లో తల్లి, పెద్దమ్మను వేధింపులకు గురిచేయడంతో పాటు పలుమార్లు వారిపై దాడి చేశాడు.
తనకు పెళ్లి చేయాలని తల్లి, పెద్దమ్మతో మద్యం మత్తులో కుమారుడు గొడవకు దిగాడు. ముగ్గురు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లి, పెద్దమ్మను అతడు చితక బాదాడు. కోపంతో రగిలిపోయిన వారు కుమారుడిపై మరుగుతున్న నూనె పోశారు. అనంతరం రాయితో కుమారుడి తలపై మోదీ హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.