Sunday, December 22, 2024

ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నలు

- Advertisement -
- Advertisement -

గాంధీలకే గ్యారెంటీ లేదు… ఇక కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారెంటీలకు గ్యారెంటీ ఏమిటి ?
రైతుబంధు మాత్రమే ఆపాలా… అన్ని పథకాలు ఆపేయాలా ?
ఎప్పటినుంచో అమలవుతున్న సిఎం కెసిఆర్ గారి పథకాలు ఆపడం సాధ్యమా ?
దీన్నిబట్టే కాంగ్రెస్ పార్టీ ఎంత భద్రతాభావంలో ఉందో అర్థమవుతుంది
దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను పక్కన పెట్టి అన్ని గ్యారెంటీలను రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ప్రకటిస్తున్నారు…

పేరుకు మాత్రమే ఖర్గే అధ్యక్షుడు కానీ మొత్తం పార్టీని నడిపిస్తోంది…
కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ఎక్కడ ప్రకటించారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి
బిసిలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసింది
కోరుట్లలో ఎంపి అరవింద్ ఓటమి తథ్యం… ఓడించడానికి బిఆర్‌ఎస్ కార్యకర్తలు భీష్మించారు
కామారెడ్డిలో ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరు పోటీ చేసిన సిఎం కెసిఆర్ గెలుపు ఖాయం
వందకు పైగా సీట్లను సాధించి బిఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుంది
నిజామాబాదులో కల్వకుంట్ల కవిత

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో రాహుల్ గాంధీ వర్సెస్ రైతన్నల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ పార్టీ కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బిజెపి పార్టీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని, రైతుబంధును ఆపేయాలని ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేయడం పట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఆపాలని, దళితబంధు ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌ను కోరడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు.

‘ సిఎం కెసిఆర్ ఇస్తున్న పథకాలు ఆపుకుంటూ వెళ్లాలంటే ముందు కరెంటు కట్ చేయాలి. ఆ తర్వాత మిషన్ భగీరథ నీళ్లు ఆపాలి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆపాల్సి వస్తుంది. వీటిని ఆపడం సాధ్యమవుతుందా? పది సంవత్సరాల నుంచి నడుస్తున్న పథకాలు కొత్తవని భావిస్తుంటే కాంగ్రెస్ ఎంత అభద్రతాభావంలో ఉందో అర్థమవుతుంది’ అని మండిపడ్డారు. ఇప్పటినుంచి అమలవుతున్న పథకాన్ని నిలిపివేయించి రైతులను బాధపెడితే కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుందని విశ్లేషించారు. కాంగ్రెస్ వాళ్లకు రాహుల్ గాంధీ ఉంటే తమకు రైతన్నలు ఉన్నారని తేల్చి చెప్పారు. ఎన్నికలు రాహుల్ గాంధీ వర్సస్ రైతన్నల మధ్య జరగబోతున్నాయని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా రైతుల గురించి ఆలోచించలేదని, నష్టపరిహారం చెల్లించకుండా రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిందని విమర్శించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుని ఆదుకుందని, రైతన్నకు అండగా నిలబడింది కేవలం సిఎం కెసిఆర్ మాత్రమేనని తెలిపారు. రైతులు, మహిళలకు విఘాతం కలిగించి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందన్నారు. తమకు రైతుల కంటే ఎవరు ఎక్కువ కాదని, రైతులను ఇబ్బంది పెట్టి తాము సాధించేది ఏమీ లేదని, కాబట్టి రైతుల అభ్యంతరం వ్యక్తం చేయడంతో కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను నాలుగు నెలల క్రితమే నిలిపివేశామని గుర్తు చేశారు. కాబట్టి రైతులు ఎటువంటి అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదని కోరారు.

‘ఓట్లు చీలితే ఎవరికీ లాభమో ముస్లిం సోదరసోదరీమణులు ఆలోచించాలి. ఓట్లను చీల్చకుండా కెసిఆర్ వైపు నిలబడితే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుంది. ఏ ప్రభుత్వం వస్తే మతసామరస్యం వెల్లువిరుస్తుందో మీ అందరికీ తెలుసు. అది బిఆర్‌ఎస్ ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది. ముస్లిం యువతీయువకులకు ఉద్యోగాలు లభిస్తాయి’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి నుంచి పారిపోయి నిజామాబాద్ కు వస్తున్నారని, కాబట్టి ఆయన ముఖం చూసి కాకుండా పార్టీలను చూడాలని విజ్ఞప్తి చేశారు.

మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు గానే చూసింది కానీ మైనారిటీల అభివృద్ధికి ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్‌నును బలపరచాలని మైనారిటీ వర్గాలకు కవిత పిలుపునిచ్చారు. ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువయ్యారని, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి మారుతున్నారు తెలియని పరిస్థితి ఉన్నదని ప్రస్తావించారు. పాలోడా… పగోడా అంటూ కొంతమంది మాట మార్చుకున్న సందర్భాలు చూస్తున్నామని పరోక్షంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిం చారు. ఒక్క కెసిఆర్‌ని ఎదుర్కోవడానికి ఎంతమంది, ఎన్ని సమీకరణలు మారుతున్నాయో తెలంగాణ ప్రజలు గమనించారని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రెండు ఎన్నికల్లో 9 కి 9 సీట్లను బిఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుందని, ఈసారి కూడా అన్ని స్థానాలను గెలిపించడానికి తామంతా కష్టపడుతున్నామని చెప్పారు. గల్ఫ్ కార్మికులు, బీడీ కార్మికులతో సహా అన్ని వర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని వివరించారు.

నిజాలు చెబుతూ ప్రచారం చేయడం బిఆర్‌ఎస్ లక్షణమని, కాంగ్రెస్‌లాగా అబద్ధాలు చెప్పడం, బిజెపి లాగా పథకాలను కాపీ కొట్టి పేర్లు మార్చి తమ పథకాలే అని చెప్పుకోవడం తమకు రాదని, కాబట్టి తప్పకుండా మరోసారి అధికారంలోకి వస్తామన్న సంపూర్ణ విశ్వాసం ఉందని కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. వందకు పైగా సీట్లు సాధిస్తాం అన్న విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఒక్కొక్క వర్గం సిఎం కెసిఆర్‌కు దగ్గరవుతూ వచ్చిందే తప్ప ఏ ఒక్క వర్గం దూరం కాలేదని విశ్లేషించారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గమనించడం లేదని, అందుకే వాళ్లు అన్ని వర్గాలకు దూరమవుతున్నారని విమర్శించారు. మూడు గంటల కరెంటు ఇవ్వాలని, రైతుబంధు ఆపాలని అంటున్న కాంగ్రెస్ పార్టీ రైతులకు దూరమైందని చెప్పారు. తమ పార్టీ మేనిఫెస్టో ఎంత అద్భుతంగా ఉందో ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను తాము కాపీ కొట్టామని ఆ పార్టీ నాయకులు అంటుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను పక్కన పెట్టి అన్ని గ్యారెంటీలను రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ప్రకటిస్తున్నారని, పేరుకు మాత్రమే ఖర్గే అధ్యక్షుడు కానీ మొత్తం పార్టీని నడిపిస్తుంది గాంధీలేనని విమర్శించారు. గాంధీలకే గ్యారెంటీ దిక్కులేదు, అలాంటి రాహుల్ గాంధీ తెలంగాణకొచ్చి గ్యారంటీలు ఇవ్వడం, వాటిని మనం నమ్మడం జరిగే పనే కాదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని తెలిపారు. బిసిలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, బిసిలకు కాంగ్రెస్ పార్టీ గొడ్డలుపెట్టు లాంటిదని కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. మండల్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయలేదని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిసి నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారని తెలిపారు. దేశంలో బిసిల కోసం కేటాయిస్తున్నంత బడ్జెట్ ఎక్కడ కేటాయించలేదన్నారు. బిసిలకు బిఆర్‌ఎస్ పార్టీ చేసినంత ఎవరు చేయలేదని, అందుకే ఇది బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదు బిసిల ప్రభుత్వం అని చెప్పుకుంటామని వివరించారు. కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో జాబ్ క్యాలెండర్ ఎక్కడ ప్రకటించారో ఆ పార్టీ నాయకులు చెప్పాలని కల్వకుంట్ల కవిత సవాల్ చేశారు.

కాంగ్రెస్, బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరిగిన అన్ని పరీక్షా పత్రాల లీకేజీలు, మాస్ కాపీయింగులు, జరుగుతున్న అవినీతి, వ్యాపం కుంభకోణాలు, ఉద్యోగాల పేరిట జరుగుతున్న స్కాంలు, యువకులను మోసం చేయడానికి తెలంగాణలో ఒక్క సారి కూడా జరగలేదని వివరించారు. తెలంగాణలో ఒకే ఒకసారి ఒక పార్టీ కుట్ర చేసి పేపర్ లీకేజీ చేసే ప్రయత్నం చేస్తే రెండు రోజుల్లోనే వాళ్లను పట్టుకుని లోపల వేశామని గుర్తు చేశారు. బోయ సామాజిక వర్గాన్ని ఎస్‌టి జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపించేసిందని, ప్రస్తుతం ఆ అంశం కేంద్రం పరిధిలో ఉందని చెప్పారు. కోరుట్ల బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపి అరవింద్ ను తప్పకుండా ఓడిస్తానని పునరుద్ఘాటించారు. కోరుట్లలో తమ పార్టీ కార్యకర్తలు అరవింద్‌ను ఓడించడానికి భీష్మించుకున్నారని, ఆ దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. అరవింద్ పట్ల తనకంటే ఎక్కువ తమ పార్టీ కార్యకర్తలు ఎక్కువ కోపంగా ఉన్నారని, వందకు 150 శాతం ఓడగొడుతామని, అందులో ఎటువంటి సందేహమేలేదని తేల్చి చెప్పారు. కోరుట్లకే కాకుండా మొత్తం నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి అరవింద్ చేసింది ఏమీ లేదన్నారు. అసలు ఇక్కడ బిజెపికి స్థాయి లేదని, ఆ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం లేదని తెలిపారు. బిజెపి తెలంగాణకు అడుగడుగున అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంటులో ప్రధాని మోడీ మాట్లాడారని, బిజెపి పార్టీతో కలిసే ప్రసక్తే లేదని, అంత అవసరం కూడా తమకు లేదని స్పష్టం చేశారు. కామారెడ్డిలో కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనీ జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందిస్తూ సిఎం కెసిఆర్‌ను రాష్ట్రవ్యాప్తంగా పర్యటించకుండా కేవలం పోటీ చేస్తున్న నియోజకవర్గానికి పరిమితం చేయాలని భావించి రేవంత్ రెడ్డి చేస్తారంటే అది అమాయకత్వమే అవుతుందని, నియోజకవర్గంలో సిఎం కెసిఆర్‌కు పని చేయడానికి అనేక మంది కార్యకర్తలు ఉన్నారని, కాబట్టి సిఎం కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించే ప్రచారం చేస్తారని వివరించారు. తమ నిరంతరం ప్రజల్లో ఉంటాము కాబట్టి ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరి పోటీ చేసిన గెలుపు మాత్రం సిఎం కెసిఆర్‌దేనని తేల్చిచెప్పారు. కామారెడ్డి లో సిఎం కెసిఆర్ గెలుపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చాలా ఉపయోగపడుతుందని, అభివృద్ధిలో మలుపు తిప్పుతుందని, కాబట్టి సిఎం కెసిఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రచారంలో తమ పార్టీ చాలా ముందుందని, పార్టీ ఎజెండా, మేనిఫెస్టో, సిఎం అభ్యర్థి వంటి విషయాల్లో తమకు చాలా స్పష్టత ఉన్నదని తెలిపారు. ఇతర పార్టీలో ఆ స్పష్టత లేకపోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.

గత పది ఏళ్లలో తెలంగాణ వేగంగా ఎదగడానికి కారణం రాజకీయ సుస్థిరత అని, రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్ పార్టీ రాజకీయంగా సుస్థిరంగా ఉంచిందని స్పష్టం చేశారు. దాంతో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా స్థిరమైన పాలనను అందించామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రాజకీయంగా లేనప్పుడు ఇతర రాజ్యాలపై ఆధిపత్యం చెలాయిస్తారని, ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాలను కబ్జా చేయడం లేకపోయినా మన అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతాయన్నారు. తెలంగాణలో రాజకీయ సుస్థిరత కారణంగా ఐటి రంగానికి హబ్‌గా ఉన్న బెంగళూరుని తలదన్ని మనం ఐటి పరిశ్రమలు తెచ్చుకోగలుగుతున్నామని చెప్పారు. భారతదేశంలో రెండు ఐటి ఉద్యోగాలు ఉంటే అందులో ఒకటి హైదరాబాద్‌లోనే కలుగుతుందంటే అందుకు ప్రధాన కారణం హైదరాబాదులో మెరుగైన మౌలిక సదుపాయాలేనని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగితే ఇప్పటికే అమలవుతున్న అత్యుత్తమ విధానాలు కొనసాగుతాయన్నది అందరిలోకి వెళ్లిందని, అభివృద్ధి కొనసాగాలంటే సిఎం కెసిఆర్ నాయకత్వంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రైతుబంధు, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల లబ్ధిదారులకు కలిగిన ప్రయోజనం తమకు అవసరం ఉన్నప్పుడు కూడా కలుగుతుందని ఇతరులకు విశ్వాసం కలిగిందని వివరించారు. ప్రజల మీద భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లాతో పాటు అనేక జిల్లాల్లో ఐటి హబ్ లు ఏర్పడతాయని ఎవరూ అనుకోలేదని, కాని జిల్లాల్లో సిఎం కెసిఆర్ ఐటి హబ్‌లు ఏర్పాటు చేసి చూపించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో పారిశ్రామిక హబ్‌లు కూడా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అందులో భాగంగా నిజామాబాదులో పారిశ్రామిక వాడలకు అవసరమైన భూములను సిద్ధం చేసుకున్నామని గుర్తు చేశారు. తదుపరి దశ అభివృద్ధిలో పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. తమిళనాడు తర్వాత చిన్న పట్టణాలు అత్యధిక ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణలో 47% పట్టణీకరణ జరిగిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News