Monday, January 20, 2025

ఇది బిఆర్‌ఎస్ విజయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : ఒకటి కాదు రెండు కాదు.. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి పదేళ్ల పాటు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు బిఆర్‌ఎస్ చేసిన సుదీర్ఘ ఫోరాటం ఫలించడం సంతోషంగా ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ -కరీంనగర్ రాజీవ్ రహదారి, హైదరాబాద్ -నాగపూర్ జాతీయ రహదారి రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంపట్ల కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ బిఆర్‌ఎస్ పార్టీ సాధించిన విజయమని వ్యాఖ్యానించారు. గత ఏడాది జూలై 31న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా బిఆర్‌ఎస్ ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకున్నదని, దానికి అనుగుణంగా కేంద్రం ఆమోదం తెలపడం హర్షించదగ్గ పరిణామం అని పేర్కొన్నారు.

గతంలోనే రక్షణశాఖ తమ ఆధీనంలోని 33 ఎకరాలను కేటాయించిందని, ఇప్పుడు మరో 150 ఎకరాలను కూడా అప్పగించేందుకు ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వెల్లడించారు. ఈ రెండు రూట్లలో రక్షణ శాఖ భూములు ఉండటం వల్ల ఇంతకాలం రోడ్ల విస్తరణ సాధ్యం కాకపోవడం, దశాబ్దాల పాటు ప్రభుత్వాలు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి చొరవ తీసుకోకపోవడంతో… ప్రజలు ట్రాఫిక్ సమస్యతో ఇంతకాలం ఇబ్బందులు పడ్డారని కెటిఆర్ పేర్కొన్నారు. అందుకే 2014లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రెండు మార్గాల్లో ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ల నిర్మాణం కోసం అనేక కీలక ప్రణాళికలు రూపొందించామని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు నిరంతర సంప్రదింపులు జరిపామని గుర్తు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతి సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కెసిఆర్‌తోపాటు.. తాను, ఇతర మంత్రులు, ఎంపిలు ఢిల్లీ పెద్దలను కలిసి వినతిపత్రాలు అందజేశామని, ప్రతి సందర్భంలో వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎలివేటెడ్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని రకాల ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వానికి పంపించామని, వారు లేవనెత్తిన ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు అందిస్తూ ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు.
ఆయా రూట్లలో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి
హైదరాబాద్‌లోని రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో ఇక ఆయా రూట్లలో వచ్చి వెళ్లే ప్రజలకు పూర్తిగా ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోతాయని కెటిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు గత బిఆర్‌ఎస్ పదేళ్ల పాటు చేసిన పోరాటంలో భాగస్వాములైన అధికారులకు, యంత్రాంగానికి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఏ ఒక్కరి వల్లనో ఇది సాధ్యం కాలేదని, ఇది సమిష్టి విజయమని స్పష్టం చేశారు. ఎల్‌బి నగర్‌తోపాటు.. ఇతర రూట్లలో ఇలాంటి అడ్డంకులు లేకపోవడంతో… గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో.. యుద్ధప్రాతిపదికన అనేక ఫ్లై ఓవర్ల నిర్మాణాలు పూర్తిచేయగలిగామని గుర్తుచేశారు. తమ పాలనలో మెరుపు వేగంతో నిర్మించిన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల వల్ల హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా తీరిపోయాయని స్పష్టం చేశారు. తాజాగా, జెబిఎస్ నుంచి శామీర్‌పేట, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ రూట్‌లలో రెండు ఫ్లై ఓవర్లకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణాలను అత్యధిక ప్రాధాన్యతా క్రమంలో పెట్టుకుని పనులు చేపట్టాలని కోరా రు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News