కేజ్రీవాల్‌పై వరుస పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: అరెస్టయి తీహార్ జైలులో జుడిషియల్ రిమాండ్‌లో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ దరుసగా దాఖలవుతున్న పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకసారి ఆ విషయంపై విచారణ జరిపి అది ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాత పదేపదే అదే విషయమై తమ వద్దకు రావడం తగదని హైకోర్టు అభిప్రాయపడింది. సీక్వెల్స్ ఉండడానికి ఇదేమీ జేమ్స్ బాండ్ సినిమా కాదని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.
కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ మందలించారు. కోర్టును రాజకీయ వ్యవహారంలోకి లాగేందుకు ప్రయత్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్‌కు రూ.50,000 జరిమానా విధిస్తామని జస్టిస్ మన్మోహన్ హెచ్చరించారు. సీక్వెల్స్ ఉండేందుకు ఇదేమీ జేమ్స్ బండ్ సినిమా కాదు. లెఫ్టెనెంట్ గవర్నర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు.
రాజకీయ వ్యవహారంలోకి మమల్ని లాగేందుకు మీరు(పిటిషనర్) ప్రయత్నిస్తున్నారు. అంతకుమిచి ఏమీ లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తాము గవర్నర్ పాలనను విధించలేమని జస్టిస్ మన్‌మీట్ పిఎస్ అరోరాతో కూడిన ధర్మాసనం పునరుద్ఘాటించింది. పిటిషనర్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 50,000 జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీచేస్తామని పిటిషనర్‌ను కోర్టు హెచ్చరించింది.