మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తమకు ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రజలు తీర్పు ఇ చ్చారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు పేర్కొన్నారు. ఇది కేవలం స్పీడ్ బ్రేక ర్ మాత్రమే అని, మళ్లీ స్ట్రాంగ్‌గా తిరిగివస్తామని చెప్పారు. తమకు ప్రజలు అప్పగించిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా, బాధ్యతగా పోషిస్తామ ని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆదివారం తెలంగాణ భవన్‌లో కెటిఆర్ మీడియాతో మాట్లాడా రు. ఆగస్టు 21న తమ నాయకుడు కెసిఆర్ పార్టీ అభ్యర్థులను ప్రటించిన తర్వాత దాదాపు 100 రోజుల పాటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు కష్టపడ్డ పార్టీ నాయకులు, కార్యకర్తలకు కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ కోసం కార్యకర్తలు, నాయకులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ అహర్నిశలు శ్రమించారని పేర్కొన్నారు.
60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్న బిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో గెలుపునకు ఎంతో కష్టపడి శ్రమించినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదని చెప్పారు. గతం కంటే మంచి మెజార్టీ సాధిస్తామనే ఆశాభావంతో ఎన్నికలకు వెళ్లామని, కానీ అనుకున్న ఫలితం రాలేదని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుని, కారణాలను సమీక్షించుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు గానూ ప్రజలు తమకు 39 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని ఆదేశించారని, ఆ పాత్రను సమర్థవంతంగా, బాధ్యతగా నిర్వహిస్తామని వెల్లడించారు. పదేండ్లుగా ప్రభుత్వాన్ని ఎంత సమర్థవంతంగా, విశ్వాసంగా సేవలందించామో అదే పద్ధతుల్లో ఈ కొత్త ప్రాత కూడా నిర్వర్తిస్తామని అన్నారు. ఈ ఎదురుదెబ్బను ఒక గుణపాఠంగా తీసుకొని, నేర్చుకోవాల్సినవి నేర్చుకుని ముందుకు సాగుతాం అని కెటిఆర్ తెలిపారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం టిఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ 23 ఏండ్లలో తమకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాయని కెటిఆర్ పేర్కొన్నారు. అవన్నీ తట్టుకుని అనుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాన్ని సాధించామని, ఆ తర్వాత ప్రజల దయతో రెండు సార్లు అధికారంలోకి వచ్చామని చెప్పారు. ఈ పదేండ్లు చేసిన పని పట్ల సంతృప్తి ఉందని అన్నారు. ఇవాళ ఫలితాలు కొంత నిరాశ పరిచినా బాధ, అసంతృప్తి లేదని పేర్కొన్నారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆదరణ మన్నన పొందడానికి కెసిఆర్ నాయకత్వంలో బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న అందరూవిశేషమైన కృషి చేశారని, వారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. కార్యకర్తల పోరాట ఫలితం కారణంగానే ఇంత దూరం వచ్చామని కెటిఆర్ తెలిపారు.
ప్రతిపక్ష పాత్రలో అలవోకగా ఇమిడిపోతాం
ప్రతిపక్ష పాత్రలో కూడా తాము అలవోకగా ఇమిడిపోతామని, ప్రజల పక్షాన ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు. తమకు అడుగు అడుగునా అండగా నిలబడి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు కెటిఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఆ బాధను దిగమింగి, అంతే వేగంగా ప్రజల మన్నన తిరిగి పొందుదామని చెప్పారు. గతంలో కంటే రెట్టింపు గా కష్టపడి ప్రజాదరణ పొందుతామని తెలిపారు. ఈ ఫ లితాలు చూసి ఎవరూ నిరాశకు లోను కావొద్దని, ఇవన్నీ రాజకీయాల్లో సర్వ సాధారణమే అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు
తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని ఆ కాంక్షించారు. తమ పార్టీ తరపున కూడా కాంగ్రెస్ పార్టీ కి శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. తాము నిర్మాణత్మకంగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతామని చెప్పారు. ఇప్పుడే కొత్త ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయమని, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.బిఆర్‌ఎస్ కార్యకర్తలెవరూ కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని కెటిఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల శ్వాసగా కొనసాగించిన ప్రస్థానాన్ని మరింత ధృఢ సంకల్పంతో ముందుకు పోదామని చెప్పారు. హైదరాబాద్ మహా నగరం, మెదక్ జిల్లా తమకు అండగా నిలబడిందని, కొన్ని చోట్ల స్వల్ప తేడాతో తమ అభ్యర్థులు ఓటమి పాలయ్యారని తెలిపారు.
అనూహ్యంగా తమ మంత్రులు కూడా ఓడిపోయారని చెప్పారు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బేకర్, ఎదురు దెబ్బ మాత్రమే అని, దీనికి నిరాశపడొద్దు, కుంగిపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేద్దామని చెప్పారు. ఓటమి గల కారణాలు సమీక్షలు చేసుకుని, మార్పులు చేర్పులు చేసుకుందాం చెప్పారు.
ఫలితాలు అర్థం కాకుండా ఉన్నయ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి వేవ్ లేదని.. అదే సమయంలో ఫలితాలు అర్థం కాకుండా ఉన్నాయని కెటిఆర్ అన్నారు. ఇది వేవ్ అయితే రాష్ట్రమంతా ఒకేలా ఉండేదని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు తమకు ఏకపక్షమైన తీర్పునిచ్చారని, మెదక్ జిల్లాలోనూ దాదాపు ఏకపక్షంగా ఉందని, అలాగే కరీంనగర్‌లో 40 నుంచి -60శాతం వరకు తమ అభ్యర్థులు గెలిచారని చెప్పారు. ఈ ఫలితాలపై తమ పార్టీ నాయకులు, అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత వారి అనుభవాలను కూడా తెలుసుకుంటామని అన్నారు.
చెన్నూరులో తమ అభ్యర్థి బాల్క సుమన్ చేసినంత అభివృద్ధి మంత్రులు కూడా చేయలేదు అని, సింగరేణికి తాము చేసినంత మేలు ఎవరూ చేయలేరని పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ అడ్డుకోవడం.. కార్మికులకు బోనస్ ఇవ్వడం, సింగరేణి కార్మికులకు సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం, వారసత్వ ఉద్యోగాలనే పెండింగ్ సమస్యను పరిష్కరించామని, కానీ, ఫలితాలు చూస్తే అక్కడ తమ అభ్యర్థి ఓడిపోయారని అన్నారు. ఎన్నికల ఫలితాలు కొంత ఆశ్చర్యకరంగా ఉన్నాయని, ఇంకా లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
ఎగ్జిట్ పోల్స్ తప్పు అని నేను చెప్పాను… కానీ అనుకున్న ఫలితం రాలేదు
తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి 39 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారని కెటిఆర్ పేర్కొన్నారు.ఎన్నికల్లో గెలవాలనే సహజంగా ఆశిస్తామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఆ అంచనాలు తప్పు అని, 70 సీట్లు వస్తాయని తాను చెప్పానని, కానీ తాను అనుకున్న ఫలితం రాలేదని అన్నారు. ఈ ఫలితాలపై కొంత నిరాశ ఉంది కానీ.. బాధ లేదు అని చెప్పారు. ప్రజలు తమకు రెండుసార్లు అవకాశం కల్పించారని, తెలంగాణ ప్రజానీకానికి సర్వదా రుణపడి ఉంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలకు తమకు పది సంవత్సరాలు అవకాశం కల్పించారని పేర్కొన్నారు.
రాజకీయాల్లో హుందా తనం, స్థితప్రజ్ఞత చాలా ముఖ్యం
రాజీకాయాల్లో హుందా తనం, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యమని తమ నాయకుడు నేర్పించారని కెటిఆర్ తెలిపారు. ఎన్నికల్లో గెలువగానే పొంగిపోవద్దు.. ఓడిపోగానే కుంగిపోవద్దు తమ నాయకుడు కెసిఆర్ ఎప్పుడూ చెబుతారని, తాను కూడా తమ నాయకులు, కార్యకర్తలకు అదే చెబుతున్నారని కెటిఆర్ పేర్కొన్నారు. గెలిచినప్పు పొంగిపోవడం.. ఓడిపోగానే కుంగిపోవడం ఓ రాజకీయ నాయకుడి లక్షణం కాదు… ధీరుడి లక్షణం కాదు అని అన్నారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా తెలంగాణ ఉద్యమంలో ధీరోదాత్తంగా పోరాడమని, మేం ఇలాంటివి ఎన్నో చూశామని గుర్తు చేసుకున్నారు. మమ్మల్ని ఖతం చేయాలని, మా పార్టీని ఫినిష్ చేయాలనే ప్రయత్నాలను ఎన్నో చూశామని కెటిఆర్ చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తూ తమకు ప్రజలు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తామని తెలిపారు. ఇవాళ మేం ఓడిపోయాం. కానీ, ప్రతి రోజూ ఇదే జరుగదని.. ఇవాళ ఆదివారం.. ప్రతిరోజూ ఆదివారం కాదు అని…. ఇది గుర్తించుకోవాలని చెప్పారు. మేం మళ్లీ స్ట్రాంగ్‌గా తిరిగి వస్తామని కెటిఆర్ స్పష్టం చేశారు.