హైకోర్టు జడ్జీల బదిలీపై జస్టిస్ బిబేక్ చౌదరి వ్యాఖ్య
కల్‌కతా: అధికారం ఎగ్జిక్యూటివ్‌నుంచి జ్యుడీషియరీకి బదిలీ కావడం ప్రారంభమయినదనడానికి తన బదిలీ సంకేతమని కలకత్తా హైకోర్టునుంచి పాట్నా హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ బిబేక్ చౌదరి అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ సమయంలో వేర్వేరు హైకోర్టుకు చెందిన 16 మంది జడ్జిలను ఎగ్జిక్యూటివ్ బదిలీ చేసిందని, 48 ఏళ్ల తర్వాత ఇప్పుడు కొలీజియం 24 మంది జడ్జిలను బదిలీ చేసిందని ఆయన అన్నారు.
సోమవారం తన వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిక్యూటివ్‌నుంచి అత్యున్నత న్యాయవ్యవస్థకు బదిలీ కావడం ప్రారంభమయిందనడానికి తాను ఒక ఉదాహరణ అని ఆయన అన్నారు. హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రం వెలుపలకు చెందిన వారయి ఉండాలని, జడ్జిలలో మూడింట ఒక వంతు బయటివారు ఉండాలని 1983 జనవరి 28న కేంద్రం నిర్ణయించిందని ఆయన చెప్పారు.
తమ బదిలీ ఆ విధానం అమలు ప్రారంభానికి సంకేతమని తాను భావిస్తున్నట్లు జస్టిస్ బిబేక్ చౌదరి చెప్పారు. జస్టిస్ చౌదరిని పాటా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం గత ఆగస్టు 3న ప్రతిపాదించింది. అయితే తన బదిలీపై పునరాలోచించాలని చౌదరి చేసుకున్న అభ్యర్థనను కొలీజియం తోసిపుచ్చడంతో పాటు తన సిఫార్సును పునరుద్ఘాటించింది.