బలహీనపడుతున్న ఎల్‌నినో
గతేడాదితో పోల్చితే మెరుగ్గా రుతుపవనాలు : శాస్త్రజ్ఞుల అంచనా
న్యూఢిల్లీ :2023లో లోటు వర్షపాతాన్ని అందించిన ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికల్లా కనుమరుగు కాన్నాయని, దీంతో ఈ వర్షాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయన్న ఆశ లు కలుగుతున్నాయని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. భూమధ్య రేఖ సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంపై దీని ప్రభావం ఉంటుది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, మరి కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయి.
అయితే ఇప్పటికే ఎల్‌నినో బలహీనపడడం మొదలైందని, ఆగస్టు నాటికల్లా లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని రెండు అంతర్జాతీయ వాతావరణ ఏజన్సీలు గత వారం ప్రకటించాయి. జూన్‌ఆగస్టు మధ్యలో లా నినో పరిస్థితులు మొదలు కావడం అంటే గత ఏడాదికంటే ఈ ఏడాది రుతుపవనాలు మెరుగ్గా ఉంటాయని ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న వాతావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు. అయితే వాతావరణ మోడల్స్ కచ్చితంగా ఉండకపోవడం అనే తలనొప్పి కారణంగా అలా జరగకపోయే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు. జూన్‌జులై మధ్యలో లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కేంద్ర భూశాస్త్రాల శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అంటున్నారు.‘ఒక వేళ ఎల్‌నినో పూర్తిగా బలహీన పడకుండా తటస్థ స్థితిలో ఉన్నా ఈ ఏడాది రుతుపవనాలు గత ఏడాదికన్నా మెరుగ్గా ఉంటాయని ఆయన అంటున్నారు.