Monday, December 23, 2024

ఆ భూమి హెచ్‌ఎండిదే

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ లోని 181 ఎకరాల భూములపై హైకోర్టు కీలక తీర్పు

మన తెలంగాణ/హైదరాబాద్ : తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టి వారి రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఆ భూములు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ)కు చెందుతాయని గురువారం (డిసెంబర్ 14) తీర్పు ఇచ్చింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్‌ఎండిఎకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారు. సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్‌ఎండిఎ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎండిఎ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్‌ఎండిఎ ఎస్టేట్, లీగల్, ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని గత ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు. వాద ప్రతి వాదనల అనంతరం హైకోర్టు డివిజనల్ బెంచ్ నవంబర్ 18 వ తేదీన తీర్పును రిజర్వ్ ఫర్ ఆర్డర్స్‌లో పెట్టింది. తుది తీర్పును గురువారం (డిసెంబర్ 14) హైకోర్టు వెల్లడించింది. ఆక్రమణదారుల రిట్ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది.
పూర్వాపరాలు ఇవీ…
శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములను హెచ్‌ఎండిఎ 1990 సంవత్సరంలో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ (ఎల్‌ఎ) కింద హెచ్‌ఎండిఎ తీసుకుంది. శంషాబాద్‌లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ)కి సర్వహక్కులున్నాయి. ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్‌ఎండిఎ నర్సరీ పని చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎండిఎకు సంబంధించిన 181 ఎకరాల్లో రెండు ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు కేటాయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం హెచ్‌ఎండిఎకు సంబంధించిన ఈ భూముల నుంచి ముప్పై గుంటల భూమిని కేటాయించడం జరిగింది. అనంతర కాలంలో హెచ్‌ఎండిఎకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారు. తాజాగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News