విలీనం చేసుకున్న ఎటపాక,
కన్నాయిగూడెం, పిచుకలపాడు,
పురుషోత్తంపట్నం, గుండాల
గ్రామాలను వెనక్కిస్తే కరకట్టల
నిర్మాణం సులువవుతుంది
ముంపు నుంచి ప్రజలతో పాటు
భద్రాద్రిని గట్టెక్కిద్దాం
సున్నితమైన అంశాన్ని వివాదాస్పదం చేయొద్దు
ప్రజల కోసం అడిగితే
తెలంగాణ, ఎపిని తిరిగి
కలుపుదామనడం
అసందర్భం, అర్థ్ధరహితం
వరద సమస్య శాశ్వత
పరిష్కారానికి కలిసి పని చేద్దాం
ఆంధ్రప్రదేశ్‌కు
మంత్రి పువ్వాడ పిలుపు
అజయ్ వ్యాఖ్యలపై ఎపి
మంత్రుల అభ్యంతరం
మన తెలంగాణ/హైదరాబాద్ :వరదలు వచ్చినప్పుడల్లా భధ్రాచలం చుట్టు పక్కల ప్రాంతంలోని జనావాసాలు ముంపునకు గురవతున్నాయని రాష్ట్ర రవా ణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో పాటు దేవుడు కూడా ప్రతిసారి ముంపునకు గురవ్వడం అత్యంత బాధాకరమన్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కలిపిన ఏడు మండలాల సంగతి తరువాత చూసుకుందామని, ప్రస్తుతానికి ముంపుకు గురవుతున్న ఏటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పు రుశోత్తం పట్నం, గుండాల గ్రామాలను మాత్రం తి రిగి వెనక్కు ఇవ్వాలన్నారు. అప్పుడే భద్రాచలం వద్ద కరకట్ట కట్టడానికి సాధ్యమవుతుందన్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ప్రజల కోసం తాను మాట్లాడిన వ్యాఖ్యలను ఎపి మంత్రులు వక్రీకరించి, విమర్శించడం సరికాదన్నారు. వారు చేసిన విమర్శలపై మంత్రి పువ్వాడ వివరణ ఇచ్చారు.
భద్రాచలంలో ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం కోసం సిఎం కెసిఆర్ వెయ్యి కోట్లు ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో సిఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా సమావేశాన్ని మంగళవారం టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో భద్రాద్రి రాముడు నీటిలో మునిగితే ఎపి ప్రజలకు కూడా బాధగానే ఉంటుందని వ్యాఖ్యానించినట్లు అంగీకరించారు. ముంపు ప్రాంతాల్లో తాను పర్యటింటినప్పుడు వారి బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయన్నారు.అందుకే ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని అడిగానని అన్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే తాను ఈ ప్రకటన చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎపి మంత్రులు స్పందించి ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
పైగా హైదరాబాద్‌ను తమకు (ఎపికి) ఇవ్వమంటే ఇస్తారా? ఎపి మంత్రులు అనటం అసందర్భం, అర్థరహితమని మంత్రి పువ్వాడ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు వదలడంలో కొంత నిర్లక్ష్యం చేసినందువల్లే భద్రాచలం వద్ద వరద ఉధృతి పెరిగిందన్నారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటినుంచి టిఆర్‌ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందన్నారు. గతంలో కరకట్టలు కట్టినా అవి అంతగా పటిష్టంగా లేవన్నారు. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారం కోసం సిఎం కెసిఆర్ నిపుణుల కమిటీ వేశారన్నారు. ముంపు నకు గురయ్యే కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
గత మూడు రోజుల పాటు వానల్లో తడుచుకుంటూ వాగులు వరదలు దాటుకుంటూ భధ్రాచలం పరిసర ప్రాంతాలలోని గోదావరి వరద బాధితులను సిఎం కెసిఆర్ పరామర్శిస్తూ పర్యటించారన్నారు. ముంపు బాధితులకు అందుతున్న సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ, రూ.1000 కోట్లతో తక్షణ కార్యాచరణ ప్రకటించారన్నారు. ఇందుకు సిఎంకు ధన్యవాదాలు తెలపుతున్న సమయంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో గోదావరి వరదలు దాని నేపథ్యం దాని పర్యవసానాల గురించి మాట్లాడడం జరిగిందన్నారు. దీనిపై ఎంపి మంత్రులు అనవసరంగా తనను తప్పుపడుతూ మాట్లాడడం చాలా బాధగా ఉందన్నారు.
భధ్రాచల సీతారాములను ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రా ప్రజలు తమ ఇలవేల్పుగా కొలుచుకుంటారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఆంధ్రా మారుమూల ప్రాంతాలనుంచి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శించుకుంటారన్నారు. అటువంటి తమ ఇష్ట దైవం నీటిలో మునిగిపోతుంటే ఆంధ్రా ప్రజలకు కూడా బాధ కలుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆంధ్రామంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే విషయాన్ని తాను కూడా చెప్పానని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పువ్వాడ తెలిపారు.
పువ్వాడ వ్యాఖ్యలపై ఎపి మంత్రుల అభ్యంతరం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలపై ఎపి మంత్రులు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పొలవరం ప్రాజెక్టుతోనే భద్రాచలానికి వరదలు వచ్చాయని పువ్వాడ పేర్కొనడం సత్యదూరమన్నారు. పువ్వాడ అనవసర విమర్శలు మానుకుంటే మంచిదని సూచించారు. ఎపిలో విలీన గ్రామాలు ప్రజల కోసం ఏమి చెయ్యాలో తమకు తెలుసున్నారు.
ఈ గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే…. మళ్లీ ఎపిని కూడా కూడా కలపాలని అడుగుతామన్నారు. ఎపి ఆదాయం తగ్గింది …మరి హైదరాబాద్‌లో కలిపేస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు విలీన గ్రామాలు ప్రస్తావన తెస్తే …తాము ఎపిని
హైదరాబాద్ కలపాలని డిమాండ్ చేస్తామని బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా మరో మంత్రి అంబడి మాట్లాడుతూ, భద్రాచలం మునిగిపోవడానికి పోలవరం నిర్మాణం కారణం కాదన్నారు. వివాదాలు సెటిల్ అయ్యాయని… అనవసరంగా పువ్వాడ కొత్త వివాదాలకు అంకురార్పణ చేయవద్దు అని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 45.72 మీటర్ల ఎత్తు వరకు ఫుల్ ట్యాంక్ లెవల్ కు అనుమతి ఇచ్చిందన్నారు. మరి భద్రాచలం ఎపిది అంటే ఇస్తారా? అని ప్రశ్నించారు.