Monday, December 23, 2024

ఎన్నికల వేళ ఆ మూడు పార్టీల అస్త్ర సన్యాసం..!?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయాల్లో ప్రజల్లో తిరగడం ఎంత ముఖ్యమో, ఎన్నికల్లో పోటీ చేయడం అంతే ముఖ్యం. కానీ  ప్రొఫెసర్ కోదండరాం ఈ దఫా తెలంగాణ జన సమితి(టిజెఎస్)ని ఎన్నికల్లో పోటీకి నిలపకూడదని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో 2018లో మహాకూటమిగా కాంగ్రెస్, టిడిపి, వామపక్షాలతో పోటీ చేసిన టిజెఎస్ ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను నిలబట్టలేదు. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లాలని ఆ పార్టీ నిర్లయించుకున్నప్పటికీ, హస్తం పార్టీతో పోటీ చేసే స్థానాలు కుదరక వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. జహీరాబాద్, నర్సంపేట, హన్మ కొండ, మంచిర్యాల వంటి 13 స్థానాల్లో పోటీ చేస్తామని కాంగ్రెస్‌కు లిస్ట్ పంపితే ఒకటి , రెండు స్థానాల్లోనే అవకాశం ఇస్తామని చెప్పడంతో టిజెఎస్ తర్జన భర్జనలో మునిగిపోయింది. మరో వైపు పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా రాష్ట్రమంతా ప్రచారంలో పాల్గొనాలని టిజెఎస్ నిర్ణయం తీసుకుంది. దీంతో కాంగ్రెస్ ఇచ్చే స్థానాల్లో పోటీ చేయడం కన్నా ఆ పార్టీకే మద్ధతు తెలిపి ఎన్నికల్లో గెలిచాక ఎంఎల్‌సి వంటి పదవులు పొందాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టిజెఎస్‌కి ఈ ఎన్నికల్లో తన ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

ఎపి రాజకీయాలు వేడెక్కడం, మరో వైపు చంద్రబాబు అరెస్టు, జైల్లో గడపడం వంటి అంశాలతో కొంత డీలాపడ్డ తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న టిడిపి నిర్ణయం గట్టి షాక్‌కు గురి చేసింది. అప్పటి వరకు ఎంతో కొంత తెలంగాణ టిడిపిలో ఉన్న ఉత్సాహం సన్నగిల్లింది. ఈ క్రమంలో ఏకంగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ బిఆర్‌ఎస్ కండువా కప్పుకోవడంతో తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ టిడిపికి ప్రాతినిధ్యం లేనట్లయింది. అయితే ఒకప్పటి టిడిపి నేత, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తెరవెనుక మద్దతు ఇవ్వడంలో భాగంగానే టిటిడిపిని ఎన్నికల్లో నిలబడకుండా ఉండేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు టిడిపి తెలంగాణ క్యాడర్‌లో లుకలుకలు వినిపిస్తున్నాయి.

ఇక రాజన్న రాజ్యం తెస్తామంటూ తెలంగాణలో 2021 నుండి విస్తృతంగా పాదయాత్ర చేసిన వైఎస్సార్‌టిపి అధ్యక్షురాలు షర్మిల ఈ ఎన్నికల్లో పోటీచేయకూడదని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అంటూ సాగిన ప్రచారం చివరకు ఎన్నికల నుండి తప్పుకునే పరిస్థితికి దారి తీయడం ఆ పార్టీ నేతల్లో తీవ్రస్థాయిలో అసంతృప్తిని నింపింది. ఒంటరిగా పోటీ అన్న షర్మిల ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. ఆపార్టీ అధినేతలతోను చర్చలు జరిపింది. కానీ 2018 ఎన్నికల్లో మహకూటమిగా టిడిపితో జట్టు కట్టడం, చంద్రబాబు తెలంగాణ లో ప్రచారం చేయడం వల్ల బిఆర్‌ఎస్‌కు లాభం కలిగిందన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ అధినా యకత్వం షర్మిలతో కలిసి పోటీ చేసేందుకు కాని, ఆపార్టీ విలీనం చేసుకునే విషయంలో కాని సానుకూలంగా స్పందించలేదు. తెలంగాణ రాజకీయాల కన్నా ఆంధ్ర రాజకీయాలపై దృష్టి సారించమని షర్మిలకు సూచించినట్లు సమాచారం. ఏమైతేనేం ఆ పార్టీ కాంగ్రెస్ కు మద్ధతు ప్రక టిస్తున్నట్లు పేర్కొనడంతో వైఎస్సార్‌టిపి నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరేందుకు సన్నద్ధులవుతున్నారు. షర్మిల తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తన ఉనికిని చాటుకునే పరిస్థితిని కోల్పోయింది. ఎన్నికల ముందు వరకు హడావుడి చేసిన టిజెఎస్, వైఎస్సార్‌టిపి, టిటిడిపిలు మాత్రం అస్త్ర సన్యాసం చేశాయనే చెప్పవచ్చు.
చివరి నిమిషంలో అనూహ్యంగా బరిలోకి జనసేన
ఎపి వేదికగా రాజకీయాలు చేసిన జనసేన చివరి నిమిషంలో తెలంగాణ ఎన్నికల్లో అనూహ్యంగా బరిలో దిగింది. బిజెపితో కలిసి పోటీ చేయా లని నిర్ణయించింది. సెటిలర్స్ ఓటర్లే లక్ష్యంగా హైదరాబాద్, ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. 32 స్థానాల్లో జనసేన పోటీకి సిద్ధమని చెప్పినా 9 స్థానాల్లో జనసేనకు అవకాశం ఇవ్వాలని కమలం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు సీట్ల పంపకాలపై చర్చలు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రధాన పార్టీలుగా చెలమణి కావాలనకున్న పార్టీలు అస్త్ర సన్యాసం చేస్తే, ఎపి వేదికగా రాజకీయం చేస్తోన్న జనసేన మాత్రం తెలంగాణ ఎన్నికల బరిలో దిగడం ప్రతి ఒక్కరినీ ఆశ్యర్య చకితులను చేస్తోంది. ఇదేమీ వైచిత్రమంటూ పలువురు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
బిజెపి బిసి మఖ్యమంత్రి హమీతో పోటీ నుంచి వైదొలగిన కిషన్‌ రెడ్డి
బిసినే తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తామని అధినాయకత్వం చెప్పడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి కిషన్‌ రెడ్డి దూరంగా ఉన్నట్లు కమలం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీ అధ్యక్షుడు ఎన్నికల్లో ముందుండి నడకపోవడం పట్ల కమలం పార్టీలోను తీవ్ర చర్చ కొనసాగు తోంది. పార్టీ అధ్యకుడు ఎన్నికల నుండి తప్పుకోవడం పార్టీ క్యాడర్‌పై ఎలాంటి ప్రబావం చూపుతుందో అన్న భయం కమలం క్యాడర్‌లో ఉత్పన్నమవుతోంది.

TTDP

Pawan Kalyan

Sharmila

Kodandaram

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News