Saturday, November 16, 2024

జో ఢరా సంజో.. వో గయా

- Advertisement -
- Advertisement -

Those who are scared are to leave party Says Rahul Gandhi

ధైర్యవంతులకే కాంగ్రెస్‌లో చోటు
బిజెపి భయాల వారికి గెటౌట్లే
పార్టీ నేత రాహుల్ సందేశం
సింధియాకు ఘాటు చురకలు
సోషల్ మీడియా వర్కర్లతో మాటామంతీ

న్యూఢిల్లీ: భయాలు, సంకోచాలు ఉండేవారు పార్టీని వీడిపోవచ్చు. ఈ స్వేచ్ఛ వారికి ఉంది. ఎవ్వరైతే జంకుగొంకు లేకుండా ఉంటారో వారికి పార్టీ స్వాగతం పలుకుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఓ ఆన్‌లైన్ కార్యక్రమంలో ఆయన శుక్రవారం పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలను ఉద్ధేశించి మాట్లాడారు. వాస్తవికతను ఎదుర్కోలేని వారు, బిజెపి అంటే బుగులు పడేవారు కాంగ్రెస్ నుంచి వైదొలుగవచ్చునని రాహుల్ తెలిపారు. పార్టీకి వెలుపల ఉన్న ధైర్యవంతులైన నేతలు, కార్యకర్తలు ఇప్పుడు పార్టీకి అవసరం అని, వారిని రప్పించుకుందామని చెప్పారు. దేనికి భయపడకుండా ఉండే జనం ఎంతో మంది ఉన్నారు. అయితే వారు కాంగ్రెస్‌కు వెలుపల ఉన్నారు. ఇటువంటి వారిని ఎంచుకుని పార్టీలోకి తీసుకుంటే పార్టీ మరింత వాస్తవికం అవుతుంది. బలోపేతం అవుతుందని అన్నారు. బిజెపి అంటే భయపడే వారే పార్టీని వీడారని , జ్యోతిరాదిత్య సింధియా వంటి వారు ఈ కోవలోని వారని తెలిపారు.

భయపడని వారిని మనం మనవారిగా గుర్తించుకుందామని పిలుపు నిచ్చారు. వారిని పార్టీలోకి రమ్మందాం, భయస్తులను పార్టీ నుంచి గెంటివేద్దామని చురకలు పెట్టారు. పార్టీలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో ఉన్న వారు ఇక సెలవు తీసుకోవచ్చునని, వారిని వెళ్లనిద్దాం అని, ఈ విధంగా వారూ బాగుంటారు.ఆనందిస్తారు. మనమూ పటిష్టం అవుతామన్నారు. సాహసం ధైర్యం ఉన్న వారిని పార్టీలోకి తీసుకోవడం కాంగ్రెస్ నైజం. సిద్ధాంతం అని తేల్చిచెప్పారు. ఇదే సోషల్ మీడియా కార్యకర్తలకు తాను ఇచ్చే కీలక సందేశం అన్నారు. ఈ సందర్భంగా తన పాత మిత్రుడు జ్యోతిరాదిత్య వ్యవహారం గురించి రాహుల్ ప్రస్తావించారు. సదరు వ్యక్తికి ఎప్పుడూ భయమే, బిజెపి వచ్చి ఎప్పుడేం చేస్తుందో, తనకు ఏం అవుతుందో అనే భయంతో కొట్టుమిట్టాడాడు. చివరికి తన సొంత కొంప బాగుకు ఆర్‌ఎస్‌ఎస్ పార్టీలో చేరాడని విమర్శించారు.

ఇటీవలి కాలంలో పలువురు కాంగ్రెస్ నేతలు బిజెపిలో చేరారు. వీరిలో సింధియా కాకుండా జితిన్ ప్రసాద, నారాయణ రాణే, విఖే పాటిల్, నటి కుష్బూ వంటి వారు ఉన్నారు. ఇటీవలి కాలంలో పార్టీ కార్యకలాపాలకు ఎక్కువగా దూరంగా ఉంటూ వస్తోన్న రాహుల్ ఇప్పుడు ఇందుకు భిన్నంగా చురుగ్గా పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల ఈవెంట్‌లో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ దశలో రాహుల్ వివిధ రంగాలకు చెందిన పది మంది యువజనులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎప్పుడూ ఎవరికి భయపడవద్దని, తాను వారికి ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా కల్పించారు. తనతో ఏ వేళ అయినా మాట్లాడవచ్చునని తెలిపారు. కుటుంబ సభ్యులు తరచూ మాట్లాడుకుంటే మంచిదన్నారు. సోదరుడితో మాట్లాడుతున్నానని అనుకోండి, అభిప్రాయాలను పంచుకోండి, సోషల్ మీడియా ద్వారా భావజాల వినిమయం అవసరం అన్నారు. మీరు భయపడకండి, తానైతే ఎప్పుడూ భయపడిన సందర్భాలు లేవని, భయపడినట్లు ఎప్పుడైనా అన్పించానా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అందరికీ సమానావకాశాలు కల్పిస్తుంది. ఇందుకు భిన్నంగా ఆర్‌ఎస్‌ఎస్ కొందరికే మేలు చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News