Thursday, January 23, 2025

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత కల్పించాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థల తరహాలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారికి పోటీ చేసే అర్హత కల్పించాలని బిఆర్‌ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు చట్ట సవరణ జరిగేలా చూడాలని సంబంధిత ప్రజా ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల చట్టం 1995 ను రద్దు చేయాలనే ఉద్యమ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిమాన్ గాంధీ నాయక్, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ దేశంలో జనాభాను అదుపు చేయాలన్న సంకల్పంతో.. ఉమ్మడి రాష్ట్రంలో 27 ఏండ్ల క్రితం అన్ని స్థానిక సంస్థల ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారికి పోటీ చేసే అర్హతను నిషేధించారని గుర్తుచేశారు. దేశంలో మరే రాష్ట్రంలోలేని ఈ నిబంధన, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ కొనసాగుతున్నదన్నారు.

పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి తమ చొరవతో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ నిబంధనను ఎత్తేశారు. అదే విధంగా గ్రామ, మండల, జిల్లా స్థాయి స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఈ నిబంధనను తొలగించాలని వారు అభ్యర్థించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తొలగించిన ఈ నిబంధన… కేవలం స్థానిక సంస్థలకు కొనసాగించడంతో పోటీ చేయాలనుకునే వారికి ప్రతిబంధకంగా మారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసినవారికి అవకాశాలు లేకుండా పోయాయి. పురపాలిక, మున్సిపాలిటీలో తరహాలో స్థానిక సంస్థలకు కూడా ఇద్దరికి మించి సంతానం ఉన్న వాళ్ళకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించాలని, ఆ విధంగా ఆదేశాలు జారీ అయ్యే విధంగా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయకర్‌రావును వారు కోరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లతో చర్చించి, వారి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News