న్యూఢిల్లీ: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధింపు, దరిమిలా ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటును వ్యతిరేకిస్తూ దాదాపు 1,000 మంది రాజకీయనాయకులు, టీచర్లు, కళాకారులు, శాస్త్రవేత్తలు, సాంస్కృతిక కార్యకర్తలు, పౌరసమాజం సభ్యులు మంగళవారం ఒక లేఖ విడుదల చేశారు. పార్లమెంట్ లోపల, వెలుపల నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అవిశ్రాంతంగా విమర్శించినందుకే రాహుల్ గాంధీని టార్గెట్ చేశారని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
లేఖపై సంతకాలు చేసిన వారి తరఫున విద్యావేత్త అపూర్వానంద్, శాస్త్రవేత్త గౌహర్ రజా, హక్కుల కార్యకర్త షబ్నం హష్మి ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార పార్టీ చేతిలో దాడికి గురవుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రతిపక్షాన్ని అప్రతిష్ట పాల్జేసి, ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేయడంలో భాగంగానే రాహుల్ గాంధీపై వేటును చూడాలని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని భావిస్తూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధం కావాలని, ప్రతిపక్షానికి అండగా నిలబడాలని వారు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసందుకు అన్ని వ్యవస్థలను ఉపయోగించిన పక్షంలో ప్రజాస్వామ్యం చచ్చిపోతుందని వారు హెచ్చరించారు.
1004 teachers, artists scientists, cultural workers and civil society members express concern over Rahul Gandhi's conviction in a defamation case and disqualification from Lok Sabha @DeccanHerald pic.twitter.com/K0agu67Xut
— Shemin (@shemin_joy) March 28, 2023