నల్లనీళ్లతో వేలాది చేపలు దుర్మరణం
ఇటానగర్ : అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రఖ్యాతిగాంచిన కామెంగ్ నది ఉన్నట్లుండి నల్లగా మారింది. ఈ క్రమంలో నదిలో వేలాది చేపలు మృతి చెంది తేలియాడుతూ కన్పించాయి. ఈ ఘటన కలకలం రేపింది. నది నీళ్లు దట్టమైన నల్లటి రంగులోకి మారడం, చేపలు చనిపోవడం స్థానికంగా ప్రజలలో కలవరానికి దారితీసింది. నదిలో అత్యధిక స్థాయిలో గుర్తు తెలియని కరిగిన పదార్థాలు (టిడిఎస్) మిళితం అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనిలోని అవలక్షణాలతోనే చేపలు చనిపోయినట్లు, నీళ్లు నల్ల రంగులోకి మారినట్లు స్థానిక మత్సశాఖ అధికారి హలీ తాజో తెలిపారు. టిడిఎస్ అత్యధిక స్థాయిలో ఉంటే అటువంటి నీటిలో జలచరాలకు కంటిచూపు మందగిస్తుంది. శ్వాసతీసుకోవడం కష్టం అవుతుంది. ఈ క్రమంలో అవి ప్రాణాలు వదులుతాయి. ఇక్కడి సెపా గ్రామం పరిసరాలలో ఈ నది కలకలం చెలరేగింది. ఎగువన చైనా భారీస్థాయిలో నిర్మాణ పనులు చేపడుతున్నందున సంబంధిత మలినాలతో నీరు చెడిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆకస్మికంగా నదినీళ్ల రంగు మారడంపై ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో దర్యాప్తు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే టకూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.