Wednesday, January 22, 2025

ఎంతటివారినైనా వదిలేదే లేదు:మోడీ

- Advertisement -
- Advertisement -

బిజెపి సారథ్యపు ఎన్‌డిఎ అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తోందని, కాగా విపక్షాలు తమ అవినీతి చర్యల పరిరక్షణకు ఉద్యమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. అవినీతిపై తమ భీకరపోరు ఆగదని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని మోడీ యుపిలోని మీరట్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల సభలో స్పష్టం చేశారు. ఎవరైనా ఎంతటి హోదాలలో ఉన్నవారైనా లంచాలకు, అవినీతికి మరిగినట్లు తేలితే అటువంటి వారిపై తగు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారం ముసుగులో అవినీతికి పాల్పడే వారిని గుర్తించడం జరుగుతుంది. దర్యాప్తుల తంతు సాగుతుందని, నిజాలు నిర్థారించుకునే వరకూ ఎవరిని వదిలేది లేదని హెచ్చరించారు. ఈ మీ మోడీ భారీ స్థాయిలో మీకోసం అవినీతిపై ఉధృత యుద్ధం ఆరంభించారని, దీనితో బెంబేలెత్తిన వారంతా ఒకచోట ఇండియా కూటమిగా మారారని విమర్శించారు. కలిసికట్టుగా లేదా విడివిడిగా వీరు తనపై చేసే ఎటువంటి దాడిని అయినా ఎదుర్కొంటానని, తిప్పికొడుతానని స్పష్టం చేశారు.

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాత ఉత్తరప్రదేశ్‌లో మొట్టమొదటి ర్యాలీలో మోడీ ప్రసంగించారు. వారు అంతా కలిసి మోడీని భయపెట్టవచ్చునని అనుకుంటున్నారని అయితే వారిది అవినీతిపరుల పరివారవాదం అని, అయితే తనకు ఈ భారతే కుటుంబం అని చెప్పారు. అవినీతిపరులనుంచి భారత కుటుంబాన్ని రక్షించేందుకు ముందుకు సాగుతున్నానని తెలిపారు. ప్రత్యేకించి ఆదివారమే ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సభను దృష్టిలో పెట్టుకునే మోడీ ఘాటైన ప్రసంగం సాగింది. అత్యధిక ఎంపీ స్థానాలున్న యుపిలో జరిగిన ఈ ఎన్నికల సభలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, హర్యానా సిఎం నాయిబ్ సింగ్ సైనీ , ప్రఖ్యాత రామాయణ టీవీ సీరియల్ నటుడు రామపాత్రధారి అరుణ్ గోవిల్ , ఇటీవలే ఎన్‌డిఎలో చేరిన రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షులు జయంత్ చౌదరి ఇతరులు ఉన్నారు. యుపిలో అత్యంత సునిశితమైన మీరట్ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా అరుణ్‌గోవిల్ పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News