ఎంపి ‘అరవింద్ మోసగాడు’ అంటూ వేలాది ట్వీట్స్
దేశ వ్యాప్తంగా ట్రెండింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమంటూ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేసిన ప్రకటనపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో, గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ఎంపి అరవింద్, రెండేళ్ళు గా తమను మోసం చేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో టిఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి పసుపు బోర్డు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించగా? తెలంగాణాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే అవకాశమే లేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీనితో మండిపడ్డ నెటిజన్లు నిజామాబాద్ పసుపు రైతులకు అండగా నిలబడి పసుపు బోర్డు ఎక్కడా, రాజీనామా ఎప్పుడు చేస్తున్నారు? ఎంపి గారు అంటూ పోస్టులు పెట్టారు. పసుపు బోర్డు అంటూ మోసం చేసిన ఆయనను ’మోసగాడు అరవింద్(ఛీటర్ అరవింద్)’ అంటూ వేలాది మంది నెటిజెన్ల్ ట్విట్ చేశారు. దీంతో ఛీటర్ అరవింద్ దేశవ్యాప్తంగా ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. అరవింద్ వెంటనే తన ఎంపి పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.