వాషింగ్టన్ : టిబెట్ పీఠభూమిలో వేల ఏళ్ల నాటి ప్రాచీన వైరస్‌లను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి 15 వేల సంవత్సరాల నాటివని తేల్చారు. ఒక హిమానీ నదంలోని మంచు నమూనాల్లో ఇవి వెలుగు చూశాయి. పశ్చిమ చైనాలో 22 వేల అడుగుల ఎత్తులో ఉన్న గులియా మంచు పర్వతం నుంచి శాస్త్రవేత్తలు రెండు మంచు కోర్ నమూనాలను సేకరించి అధ్యయనం చేశారు. శిఖరాగ్రం నుంచి 1017 అడుగుల లోతులో వీటిని తీసుకొని పరిశీలించారు. అందులో 33 రకాల వైరస్‌లను గుర్తించారు. వీటిలో 28 రకాల గురించి మానవాళికి ఇప్పటివరకు తెలియదు. ఘనీభవించి ఉండడం వల్ల ఇన్నేళ్ల పాటు ఇవి భద్రంగా ఉన్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మనుగడ సాగించేలా ఇవి మార్పులకు లోనైనట్టు, వాటివల్ల మనుషులకు హాని జరగదని వివరించారు. వాతావరణ మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా మంచు కరుగుతున్నందున వీటి గురించి తెలుసుకోవలసిన అవసరం ఏర్పడిందని పరిశోధకులు లోనీ థాంప్సన్ చెప్పారు.