మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లోని ప్రఖ్యాత చాముండి మాత టెక్కి దేవాలయంలోకి బిజెపి ఎమ్మెల్యే కుమారుడు తన అనుచరులతో జబర్థస్తీగా దూసుకువెళ్లాడు.ఈ ఘటనపై ఇప్పుడు తీవ్ర విమర్శలు తలెత్తాయి. ఇండోర్ ఎమ్మెల్యే గొలు శుక్లా కుమారుడు క్యూలు , నిబంధనలను పట్టించుకోకుండా లోపలికి వచ్చారు. రాత్రి పూట సమయం ముగియడంతో దేవాలయ ద్వారాలు మూసి వేసి ఉండగా , ఈ బృందం పూజారిని పిలిపించి కొట్టి గాయపర్చి తలుపులు తెరిపించి గుడిలోకి వెళ్లినట్లు సిసిటీవీ ఫుటేజ్‌ల ద్వారా వెల్లడైందని, ఇది రాష్ట్రంలోని అధికార బిజెపి వారి దురుసు వ్యవహార శైలికి ప్రతీక అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జితూ పట్వారీ విమర్శించారు.
ఓ గుట్టపై వెలిసిన అమ్మవారి దేవాలయంలో కూడా అధికార పార్టీ వారు జలుం ప్రదర్శించారని మండిపడ్డారు. 30 గంటలు జరిగినా ఇప్పటికీ గాయపడ్డ పూజారికి సరైన చికిత్స జరగలేదు. సరైన న్యాయం జరగలేదని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ఇప్పుడు గూండాల రాజ్యం అయిందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ జరిగిన ఘటనలో బిజెపి ఎమ్మెల్యేకు కానీ, ఆయన కుమారుడి బృందానికి కానీ ఎటువంటి సంబంధం లేదని బిజెపి అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది తెలిపారు. ఘటనకు బాధ్యులను ఇప్పటికే అరెస్టు చేశారు. విచారణ జరుగుతోందని వివరించారు.