Thursday, January 23, 2025

కేరళలో మోడీపై దాడి చేస్తామన్న లేఖ కేసులో ఒకరు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: ప్రధాని నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి చేస్తానని లేఖ రాసాడని భావిస్తున్న వ్యక్తిని ఆదివారం కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాని మోడీ సోమవారం కేరళకు రెండు రోజుల పర్యటనపై రానున్నారు. నిందితుడు పి.జావియర్ అనే వ్యక్తి ఆ ఉత్తరాన్ని రాశాడని కొచ్చి పోలీస్ కమిషనర్ కె. సేతురామన్ తెలిపారు. అతడు తనకు దూరమైన మిత్రుడు, పొరుగువాడిని ఇరికించేందుకు ఇలా చేశాడన్నారు. ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాకే జావియర్‌ని అరెస్టు చేశామన్నారు.
జావియర్‌ని శనివారం రాత్రే అరెస్టు చేసినప్పటికీ ఆదివారమే అరెస్టు చేసినట్లు రికార్డు చేశామని, అతడి చేతిరాతను ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశామన్నారు. ఆ ఉత్తరాన్ని మలయాళంలో రాయడం జరిగింది. అది తిరువనంతపురంలోని బిజెపి కార్యాలయంలో ఎన్.కె.జాని అనే వ్యక్తి రెండు రోజుల క్రితమే అందింది. తర్వాత దానిని పోలీసులకు అందజేయడం జరిగింది.

ఏదిఎలా ఉన్నా ఈ ఘటనలో తన పాత్ర ఏమి లేదని జాని పోలీసుల ఇంటరాగేషన్‌లో తెలిపాడు. బహుశా అది తన పొరుగున ఉన్న జావియర్ పనై ఉంటుందని పేర్కొన్నాడు. అతడికి తన మీద కోపం ఉందన్నాడు. ‘తన పొరుగు వ్యక్తిని ఇరికించడానికే అతడా ఉత్తరం లేఖ రాశాడు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగానే అతడా ఉత్తరం రాసి ఉంటాడని పేర్కొన్నాడు. ఫోరెన్సిక్ పరీక్ష ద్వారా మేము దీనిని నిర్ధారించుకున్నాము’ అని పోలీస్ కమిషనర్ వివరించారు.

ఇదిలావుండగా, ప్రధాని పర్యటన సందర్భంగా సెక్యూరిటీ డ్రిల్ సమాచారం లీకేజీ కావడంపై, ఎంపిక చేసిన ఉన్నతాధికారులకు పంపిన సెక్యూరిటీ డ్రిల్ వివరాలు మీడియాకు లీక్ కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. 49 పేజీల ఆ సర్కూలర్‌లో ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్, పోలీసు అధికారుల మోహరింపు, ప్రధాని పర్యటనకు ముందు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ప్రత్యామ్నాయ మార్గాల వివరాలు కూడా ఉన్నాయి.

కేంద్ర మంత్రి వి. మురళీధరన్ ప్రధాని భద్రత ఏర్పాట్ల వివరాలు లీక్ కావడంతో అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హోం పోర్ట్‌ఫోలియో కూడా కలిగి ఉన్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై, కేరళ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. ఇంత పెద్ద లొసుగుపై ముఖ్యమంత్రి తన బాధ్యత నుంచి తప్పించుకోలేరన్నారు.

ప్రధాని మోడీ సోమవారం సాయంత్రం కొచ్చి చేరుకోనున్నారు. అక్కడ ఆయన 1.8 కిమీ. రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ రోడ్ షో వెందురుతి బ్రిడ్జ్ నుంచి సాక్రెడ్ హార్ట్ కాలేజ్ గ్రౌండ్స్ వరకు ఉండనుంది. తర్వాత ఆయన ‘యువం23’ అనే యువకుల సమావేశంలో ప్రసంగించనున్నారు. సాయంత్రం ఒక హోటల్‌లో సైరోమలబార్ చర్చి హెడ్ కార్డినల్ జార్జ్ అలంచెర్రీతో సహా క్రైస్తవ నాయకులతో ప్రధాని సమావేశం కానున్నారని కేరళ బిజెపి నాయకులు తెలిపారు. ప్రధాని మోడీ మంగళవారం కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకుని తిరువనంతపురం నుంచి కసరగోడ్ వరకు తొలి వండే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపనున్నారు. ఇది దేశంలో నడిచే 14వ సెమీ హై స్పీడ్ రైలు. ఆ తర్వాత కొచ్చి వాటర్ మెట్రో, సైన్స్ పార్క్, హైవే ప్రాజెక్టులు, త్రిస్సూర్‌లో ఏకశిల హనుమంతుడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని రూ. 12 కోట్లతో నిర్మించారు. కేరళలో ప్రధాని మోడీ పర్యటించేప్పుడు పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశాలున్నాయని తిరువనంతపురం పోలీస్ కమిషనర్ సి.హెచ్. నాగరాజు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News