న్యూఢిల్లీ : కొత్త సంవత్సరం(2023)లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం ముప్పును ఎదుర్కోనుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడం వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణతకు దారితీయనుందని సిఇబిఆర్(సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్) నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం, గ్లోబల్ ఎకానమీ 2022లో మొదటిసారిగా 100 ట్రిలియన్ డాలర్లు దాటింది. అయితే విధాన రూపకర్తలు ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నందున మాంద్యం 2023లో నిలిచిపోతుంది. బ్రిటీష్ కన్సల్టింగ్ సంస్థ వరల్డ్ ఎకనామిక్ లీగ్ టేబుల్‌లో ఈ విషయాన్ని తెలిపింది. ‘పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు వడ్డీ రేట్లను పెంచడం వల్ల వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది’ అని సిఇబిఆర్ డైరెక్టర్, ఫోర్కాస్టింగ్ హెడ్ డేనియల్ న్యూఫెల్ అన్నారు.
ద్రవ్యోల్బణంపై పోరాటంలో ఇంకా విజయం సాధించలేదని నివేదిక పేర్కొంది. ఆర్థిక వ్యయం ఉన్నప్పటికీ 2023లో సెంట్రల్ బ్యాంకర్ రేట్లను పెంచుతూనే ఉండాలని ఆశిస్తున్నామని నివేదిక తెలిపింది. పరిశోధన ఫలితాలు చూస్తే, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తాజా అంచనాల కంటే దిగులుగా కల్గించేలా ఉన్నాయి. ప్రపంచంలో మూడో వంతుకు పైగా ఆర్థిక వ్యవస్థ క్షీణించనుందని, 2023లో గ్లోబల్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి 2 శాతం దిగువకు చేరనుందని అక్టోబర్‌లో ఐఎంఎఫ్ హెచ్చరించింది. 2037 నాటికి ప్రపంచ జిడిపి రెట్టింపు అయి, అభివృద్ధి చెందుతున్న దేశాలు ధనికంగా మారతాయి. మాంద్యం ప్రారంభంలో కంపెనీలు తక్కువ డిమాండ్, లాభాల్లో క్షీణత, అధిక రుణాలను ఎదుర్కొంటున్నందున చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీని కోసం ఉద్యోగులను తొలగించడం ప్రారంభిస్తాయి. మాంద్యంలో వినియోగదారులు తక్కువ ఖర్చు చేస్తారు. పారిశ్రామిక ఉత్పత్తి మందగిస్తుంది.
2035 నాటికి మూడో ఆర్థిక వ్యవస్థగా భారత్
భారతదేశం 2035లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2032 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. ఇక బ్రిటన్ ఆరో ఆర్థిక వ్యవస్థకు పడిపోనుంది. ఫ్రాన్స్ ఏడో స్థానానికి చేరనుందని నివేదిక తెలిపింది. అదే సమయంలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి మరో 6 సంవత్సరాలు పడుతుంది. ఇది 2036 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ముందుగా అంచనా వేసినప్పటికీ, ఇప్పుడు అది 2042 వరకు పట్టవచ్చు. నివేదిక ప్రకారం, చైనా జీరో కోవిడ్ విధానం, పాశ్చాత్య దేశాలతో వాణిజ్య ఉద్రిక్తత కారణంగా దాని అభివృద్ధి మందగించింది. అమెరికాలో నెలకొన్న మాంద్యం భయం ప్రభావం భారత్‌పై కనిపించడం లేదు. భారతదేశంలో ఉద్యోగ వృద్ధి బలంగా ఉంది.