అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్
వెనీస్ : కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కరోనా కొత్త వేరియంట్లు సవాలుగా నిలిచే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ ఆందోళన వ్యక్తం చేశారు. డెల్టాతోసహా కొత్తగా వస్తున్న కరోనా రకాలపై తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు. పరస్పర సహకారంతో ప్రపంచ మంతా అనుసంధానమై ఉన్న నేపథ్యంలో ఎక్కడ ఏమూలన మహమ్మారి విజృంభించినా అది ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. వెనీస్‌లో జరిగిన జి 20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
జి 20 సభ్య దేశాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయాల్సి ఉందని, ఈ మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇప్పటికే కరోనా టీకాలను సమకూర్చుకోడానికి భారీ స్థాయిలో నిధులు అందజేసినా ప్రభావవంతమైన ఫలితాల కోసం ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది ప్రపంచ జనాభాలో 70 శాతం మందికి టీకాలు అందించడమే లక్షంగా ముందుకు సాగాలన్నారు. అలాగే భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను అరికట్టే ఏర్పాట్ల కోసం 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.