Thursday, January 23, 2025

తెలుగు రాష్ట్రాలకు పొంచివున్న తుపాన్ ముప్పు

- Advertisement -
- Advertisement -

తుపాను వల్ల వచ్చిన భారీ వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచివుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరికలు పంపింది. ఈ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపైన కూడా పాక్షికంగా పడే అవకాశం ఉందని తెలిపింది.దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అది పశ్చిమ దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనుందని తెలిపింది. దీంతో ఈ నెల 13 నుంచి 15 మధ్య వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడి,

ఈనెల 17 నాటికి ఏపీలోనే తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ భావిస్తోంది. ఇది తుపానుగా బలపడి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్యలో ఈ నెల 15 నాటికి తీరాన్ని తాకవచ్చని అమెరికా నమూనా అంచనా వేస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతనే దీనిపై ఒక స్పష్టత వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అరేబియాలో మరో అల్పపీడనం:
అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పడీనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది గోవా, కర్ణాటక తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా కదులుతూ రెండు లేదా మూడు రోజుల్లో మధ్య అరేబియా సముద్రంలో వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ వివరించింది. మరోవైపు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. గురువారం రాత్రి కరీంనగర్‌లో భారీ వర్షం పడింది. ఇటు హైదరాబాద్‌లోనూ గత 24గంటలుగా ఆకాశం మేఘావృతమై ఉంది. పలుచోట్ల వర్షం పడింది. శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో చిరుజల్లులు నగరవాసులను పలకరించాయి. శనివారం ఉదయం వరకు

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని అదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ ,వనపర్తి జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదరు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదివారం అదిలాబాద్, కొమరంభీమ్ , మంచిర్యాల, నిర్మల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News