లక్నో: అయోధ్య రామాలయ ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది . యోగి ఆదిత్యనాథ్‌తోపాటు రామాలయాన్ని పేల్చేస్తామని బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎస్‌టిఎఫ్ చీఫ్ అమితాబ్ యశ్‌ను కూడా హత్య చేస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టి గోండాకు చెందిన తాహర్ సింగ్, ఓం ప్రకాష్ మిశ్రా అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ పారామెడికల్ ఇనిస్టిట్యూట్‌లో పని చేస్తున్నారని తెలిపారు.
తాహర్‌సింగ్ మొయిల్స్‌ను సృష్టించగా, ప్రకాశ్ బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ నవంబర్‌లో ఎక్స్ (ట్విట్టర్)లో దేవేంద్ర ఆఫీస్ అనే హ్యాండిల్‌ను ఉపయోగించి ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు పంపినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ మెయిల్స్‌ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెందిన జుబేర్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించినవని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.