పర్యావరణ సమతుల్యాన్ని, జలాధారాలను, నీళ్ల మార్గాలను ఏమాత్రం చిన్నాభిన్నం చేసినా ఊహించని వైపరీత్యం విరుచుకుపడక తప్పదు. సమగ్ర ప్రణాళికలతో నగరాలను విస్తరించాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఎక్కడపడితే అక్కడ కట్టడాలు కట్టుకుపోతే ఎప్పటికైనా ప్రమాదమే ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో నగరాల విస్తరణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నదీ గర్భాల్లోనూ కాంక్రీట్ నిర్మాణాలు సాగిస్తున్నారు. ప్రవాహ మార్గాలను మూసివేస్తున్నారు. సముద్రతీరాన రక్షణగా ఉండే చెట్లను తోపులను నరికేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం వస్తే చాలు నీరు పల్లపు ప్రాంతాలకు వెళ్లే దారి లేక అకస్మాత్తుగా వరద ముప్పు ముంచుకొస్తుంది. 2015 చెన్నై నగరంలో సంభవించిన జలప్రళయం మనకు తెలిసిందే. చెన్నై పొలిమేరల్లో చెంబరాల బక్కం రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండి ఉండడం, వర్షం నీటికి చోటు లేక రిజర్వాయర్ నిర్వహణ సరిగ్గా లేక పోవడం , ఒక్కసారి గేట్లన్నీ ఎత్తివేయడం ఈ ప్రమాదానికి దారి తీసింది. రిజర్వాయర్ నీటి మట్టం సామర్ధం 24 అడుగులకు మించి పోవడంతో ఒక్కసారి గేట్లు తెరిచేసరికి ఉప్పెన ముంచుకువచ్చి 269 మంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.
ఇలాంటి పరిస్థితి ఏ నగరానికి రాకుండా ఉండాలంటే నీటివనరుల ఉనికికి నష్టం కలగరాదు. కోస్తా సముద్రతీర ప్రాంతాల లోని జీవ పర్యావరణ ప్రకృతిని పరిరక్షించడమే కోస్తా క్రమబద్ధీకరణ జోన్ (సిఆర్‌జెడ్) నోటిఫికేషన్ల లక్షమైనప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడంతో సముద్రాలు చొచ్చుకుని వస్తున్నాయి. పర్యావరణం దెబ్బతిని వాతావరణ మార్పులు, ఊహించలేనంతగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల కారణంగా 2050 నాటికి సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగి దాదాపు 40 మిలియన్ భారతీయులు ప్రమాదంలో పడే ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి పర్యావరణ నివేదిక హెచ్చరిస్తోంది. సముద్ర తీరాన ఉన్న ముంబై, కోల్‌కతా, నగరాల ప్రజలకు మున్ముందు ఇటువంటి ప్రమాదం ఎదురు కాగలదని అంచనా. పసిఫిక్, దక్షిణ, ఆగ్నేయాసియా శీతోష్ణస్థితిలో విపరీతమైన మార్పులు రానున్నాయి. ప్రపంచం మొత్తం మీద ప్రమాదాన్ని ఎదుర్కోనున్న 10 దేశాల్లో 7 దేశాలు ఆసియా ,పసిఫిక్ ప్రాంతం లోనే ఉన్నాయి. ఈ దేశాల మొదటిస్థానంలో భారత్ ఉంది. భారత్‌తోపాటు బంగ్లాదేశ్; చైనా తదితర దేశాలకు కూడా ఇదో హెచ్చరిక.