Tuesday, November 5, 2024

ఠాణాల్లో హక్కుల కాలరాతలు

- Advertisement -
- Advertisement -

Threat to human rights is highest in police stations

భారత ప్రధాన న్యాయమూర్తి ఆవేదన
పోలీసు మార్పుపై నిపుణులకు పిలుపు
న్యాయసాయానికి ప్రత్యేక నల్సా యాప్

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటికీ కస్టడీ చిత్రహింసలు, ఇతరత్రా పోలీసు అత్యాచారాలు ఉన్నాయని, ఇది అత్యంత బాధాకరమైన విషయం అని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ తెలిపారు. దేశవ్యాప్తంగా పోలీసు అధికారులలో పూర్తి స్థాయి పరివర్తన రావాల్సి ఉందన్నారు. వారిలో అంతర్మథనం కీలకమన్నారు. పోలీసు స్టేషన్లు(ఠాణా)లలో దారుణాలు చోటుచేసుకోవడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. సభ్య సమాజం ఎటువంటి థర్డ్‌డిగ్రీ ప్రయోగాన్ని హర్షించబోదన్నారు. ఇటీవలి కాలంలో ప్రత్యేక హక్కులు ఉన్న వారిపట్ల కూడా చిత్రహింసల పర్వం సాగినట్లు వార్తలు వెలువడ్డాయన్నారు. ఇక్కడి విజ్ఞాన్‌భవన్‌లో ప్రధాన న్యాయమూర్తి ఆదివారం జాతీయ న్యాయ సేవా కేంద్రం (నల్సా) యాప్‌ను చీఫ్ జస్టిస్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులలో సముచితరీతిలో పరివర్తన దిశలో నల్సా దృష్టిసారించాల్సి ఉందని సూచించారు.

ఠాణాలలో హక్కుల కాలరాత

దేశంలో ఇతర చోట్లతో పోలిస్తే పోలీసు స్టేషన్లలోనే మానవ హక్కులకు ముప్పు వాటిల్లుతోంది. ఇక్కడనే శారీరక హింసాకాండకు అవకాశం ఉంటోందని ప్రధాన నాయమూర్తి తెలిపారు. కస్టడీ చిత్రహింసలు, పోలీసు జులుం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. అరెస్టు అయిన లేదా నిర్బంధంలోకి వెళ్లిన వ్యక్తులకు సంబంధించి పోలీసుస్టేషన్లలో వారి పట్ల అనుసరించాల్సిన వ్యవహార శైలి గురించి రాజ్యాంగపరమైన నిర్ధేశిత అంశాలు ఉన్నాయి. వారికి భద్రత కల్పించే భరోసా ప్రక్రియలు ఉన్నాయి. అయితే ఇటువంటి ఉన్నప్పటికీ పోలీసు స్టేషన్లలో వ్యక్తులకు సంబంధించి సమర్థవంతమైన చట్టపర న్యాయపర ప్రాతినిధ్యానికి వీలు లేకపోవడం నిందితులకు సంబంధించి ప్రధానమైన చిక్కుగా మారుతోందన్నారు. అందరికీ న్యాయం, న్యాయం అందుబాటులోకి రావడం అనేది నిరంతర ప్రక్రియ అని, దీనికి అంతం అనేది ఉండదన్నారు. న్యాయం చట్టం సముచిత రీతిలో వర్థిల్లేందుకు మనం ఎంచుకునే ప్రమాణం ఒక్కటే అని, పలుకుబడిగలవారికి ఓ న్యాయం, అణగారిన వారికి ఓ న్యాయం అనే పద్థతి కుదరదని తేల్చిచెప్పారు. చట్టపాలనతో కూడిన సమాజంగా విలసిల్లేందుకు న్యాయం అందుబాటులోని వ్యత్యాసాలను నిర్మూలించాల్సి ఉంది. అత్యున్నత స్థాయిలోని గౌరవప్రదులైన వారికి, ఏ దిక్కులేని అణగారిన వర్గాలకు ఒకే విధంగా న్యాయం అందుబాటులో ఉండటం ద్వారానే న్యాయానికి న్యాయం దక్కుతుందని, దీని వల్లనే సమాజం పరిపూర్ణం అవుతుందని సిజెఐ తెలిపారు.

పౌరులలో భరోసా కల్పించాలి

రాజ్యాంగ ప్రక్రియలలో న్యాయ వ్యవస్థ కీలకమైనది. ఓ వ్యవస్థగా జుడిషియరీ దేశ పౌరుల విశ్వాసాన్ని చూరగొనడం అత్యంత కీలకమైన అంశం. పౌరుల కోసం తాము ఉన్నామనే భావనను సంబంధిత నమ్మకాన్ని కల్పించాల్సి ఉందన్నారు. ఈ విధమైన భరోసాతోనే వ్యవస్థగా జుడిషియరీ పరిపూర్ణం అవుతుందన్నారు. అయితే చాలా బాధాకరమైన వాస్తవం ఏమిటంటే అణగారిన, బడుగు బలహీన వర్గాలు, అట్టహాసపు బతుకులకు దూరంగా ఉండే వారికి చిరకాలంగా న్యాయవ్యవస్థ దూరంగానే ఉంటూ వస్తోంది. వారు జస్టిస్ సిస్టమ్ అద్దాల మేడకు వెలుపలే ఉండాల్సి వస్తోంది. ఇది వ్యవస్థకు అనుచిత లక్షణం అని జస్టిస్ రమణ తెలిపారు. అయితే గతంతో భవిష్యత్తును ఎప్పుడూ ఖరారు చేసుకుంటూ పోవడం కుదరదు. అందరికీ సమాన న్యాయం దిశలో మనమంతా పాటుపడాల్సి ఉందన్నారు. నల్సాకు చెందిన యాప్‌తో పాటు విజన్, మిషన్ ప్రకటనను కూడా ఈ సందర్భంగా జస్టిస్ రమణ ఆవిష్కరించారు.
న్యాయ సాయం కావాలా

నల్సా మొబైల్ యాప్‌తో పొందండి

ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఆవిష్కరించిన యాప్‌తో పేదలు, అవసరార్థులు తమకు కావల్సిన న్యాయసాయం కోసం అభ్యర్థించవచ్చు. తమకు జరిగిన అన్యాయానికి తగు విధమైన పరిహారం పొందేందుకు చర్యలకు దిగవచ్చు. నల్సాను లీగల్ సర్వీసెస్ అథార్టీస్ యాక్ట్ 1987 పరిధిలో ఏర్పాటు చేశారు. సమాజంలోని బలహీనవర్గాలకు ఉచిత న్యాయసాయం అందించేందుకు, వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్‌ల ఏర్పాటుకు ఈ విభాగాన్ని రూపొందించారు. నల్సాకు భారత ప్రధాన న్యాయమూర్తి హోదాలోని వారే పాట్రన్ ఇన్ చీఫ్ అవుతారు. దేశంలోని న్యాయవాదులు ప్రత్యేకించి సీనియర్లు కొంత సమమాన్ని అయినా పేదలకు ఉచిత న్యాయసాయం కోసం కేటాయించాలని, దీనితో న్యాయవ్యవస్థపై ప్రజలలో అపార నమ్మకానికి వారు వీలు కల్పించిన వారవుతారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News