Wednesday, January 22, 2025

గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  కార్లలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను రాజేంద్రనగర్ ఎస్‌ఓటి, మోకిలా పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 120కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం, బొల్లపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తురుకు చెందిన శ్రీనివాస్ ప్రేమ్‌కుమార్, జాన్ జెడ్‌సన్ కలిసి గంజాయి రవాణా చేస్తున్నారు. శ్రీకాంత్ గంజాయి,గుట్కాకు బానిసగా మారాడు.

పనిపాటలేకుండా తిరుగుతుండడంతో వ్యసనాలకు డబ్బులు లేకుండా పోయాయి. దీంతో తన స్నేహితులతో కలిసి దొంగతనాలు చేశాడు. హతయత్‌నగర్, ఘట్‌కేసర్, మేడిపల్లి, బాలాపూర్, కీసర, పటాన్‌చెరువు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరితో స్నేహం ఉంది. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన శ్రీకాంత్ ఒడిసా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి బెంగళూరులో విక్రయించాలని ప్లాన్ వేశాడు.

ప్రధాన నిందితుడు శ్రీకాంత్ గత నెల 31వ తేదీన విజయవాడకు వెళ్లి అక్కడ టోయోటా కారును అద్దెకు తీసుకుని బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి ఒడిసాలోని మల్కాన్‌గిరికి వెళ్లాడు.అక్కడ వెంకీ అనే వ్యక్తికి రూ.50,000 అడ్వాన్సు ఇచ్చి 120 కిలోల గజాయిని కారులో లోడ్ చేసుకుని బయలు దేరాడు. ఈ విషయం మిగతా వారికి చెప్పాడు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పైలెట్ కారును ఏర్పాటు చేయాలని కోరాడు. దానికి ఇద్దరు నిందితులు స్కోడా కారును తీసుకుని ముందుకు పైలట్‌గా బయలు దేరారు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో వాహనాల తనిఖీ చేస్తుండగా ఓఆర్‌ఆర్ పక్కన ఉన్న ఇంద్రారెడ్డి నగర్ కాలనీ వద్ద కారును పట్టుకున్నారు. కారులో తనిఖీ చేయగా గంజాయి లభించింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు నరేష్, రమణారెడ్డి, విజయ్‌నాయక్, ఎస్సై రాజశేఖర్‌రెడ్డి, పిసిలు రాజావర్దన్, రాజు, పాండు రమేష్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News