ముంబై,పుణె,ఢిల్లీలో సిఐడి దర్యాప్తు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో సిఐడి దర్యాప్తు వేగవంతం చేసింది. ఈక్రమంలో ఈ కేసులో ఎ6 సీమెన్స్ మాజీ ఎండి సౌమ్యాద్రి శేఖర్ బోస్, ఎ8 డిజైన్ టెక్ ఎండ ఇ వికాస్ కన్వేల్కర్, ఎ10 సిల్వర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముకుల్ అగర్వాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. వీరికి ఎసిబి కోర్టు రెండు వారాలు రిమాండ్ విధించింది.షెల్ కంపెనీల పేరుతో రూ. 241కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు గుర్తించిన సిఐడి ఈ స్కామ్ చేసిందెవరు? వాళ్ల వెనుక ఉన్నదెవరు? అన్న కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో మొత్తం 26మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సిఐడి ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. షెల్ కంపెనీల పేరుతో రూ. 241కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఈ కేసులో లింకులు అనేకచోట్ల ఉండటంతో కీలక ఆధారాలు సేకరిస్తోంది.
ఏకకాలంతో ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడతోపాటు పలు నగరాల్లో మొత్తం 8 టీమ్స్ దర్యాప్తు చేపడుతున్నాయి. ఆరోగ్య కారణాలతో ముకుల్ అగర్వాల్‌ను మచిలీపట్నం జైలుకు తరలించగా, మిగతా ఇద్దరు నిందితులను విజయవాడ జైలుకు షిఫ్ట్ చేశారు. ముకుల్ అగర్వాల్ కోవిడ్ రిపోర్ట్ రాగానే అతడిని కూడా విజయవాడ జైలుకు తరలించనున్నారు. అయితేఈ కేసులో 1 మాజీ స్పెషల్ సెక్రటరీ ఘంటా సుబ్బారావును అదుపులోకి తీసుకున్న సీఐడీ ఆయనను కోర్టులో హాజరుపర్చాల్సి ఉంది. ఈ స్కామ్‌లో ఎ2గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీనారాయణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈయన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు మొదటి డైరెక్టర్‌గా టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు వొఎస్‌డిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ ఫిర్యాదుతో ఈ స్కామ్ తెరపైకి రావడంతో ఎపి ప్రభుత్వం ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుంది.
రాధాకృష్ణపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ప్రతికాధిపతి వేమూరి రాధాకృష్ణ విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సిఐడి పేర్కొంది. ఐపిసి 353, 341,186, 120(బి) సెక్షన్ల కింద రాధాకృష్ణపై కేసు నమోదైంది. కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు సిఐడి బదిలీ చేయనుంది.కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న రాష్ట్ర సీఐడీ అధికారులను రాధాకృష్ణ అడ్డుకోడానికి ప్రయత్నించాడని, అవినీతికి పాల్పడ్డ వారి ఇళ్లల్లో అధికారులు దర్యాప్తు చేస్తుండగా సిఐడి అధికారుల విధులకు ఆటంకం కల్పించారన్న ఆరోపణలపై అతనిపై కేసు నమోదు చేశారు.