Monday, November 18, 2024

ఈతకు వెళ్లి ముగ్గురు పిల్లలు మృతి..

- Advertisement -
- Advertisement -

పెద్దపెల్లి: ఎన్టీపీసీ ఏరియా న్యూపోరట్‌పల్లికాలనీకి చెందిన ముగ్గురు విద్యార్థులు సరదాగా ఈత కోసం సమీప చెరువులోకి వెళ్లి ఈత రాక అందులోనే మునిగి చనిపోయిన సంఘటన పారిశ్రామిక ప్రాంతంలో విషాదం నింపింది. ఒకే కాలనీకి చెందిన ముగ్గురు విద్యార్థులు సోయం ఉమా మహేష్ (12) 7వ తరగతి, మామిడి విక్రం (13) 7వ తరగతి, మేకల సాయి చరణ్ (13) 8వ తరగతి అనే ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటనతో కాలనీలో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధు మిత్రుల రోధనలు మిన్నంటాయి. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రభుత్వ సెలవు దినం కావడంతో ముగ్గురు విద్యార్థులు కలిసి న్యూపోరట్‌పల్లి కాలనీ నుంచి సమీప ఇందిరమ్మ కాలనీని ఆనుకొని ఉన్న మేడిపల్లి గ్రామ చెరువుకు ఈత కోసం వెళ్లారని కుటుంబ సభ్యులు రోధిస్తూ వివరించారు.

ఈ సంఘటనలో మృతి చెందిన సోయం ఉమా మహేష్ తండ్రి సోయం జనార్ధన్ ఎన్టీపీసీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన రెండవ కొడుకు ఉమా మహేష్ ఉదయం 10గంటల ప్రాంతంలో ఇంటి నుంచి వెళ్లాడని, అతనితోపాటు అదే కాలనీకి చెందిన మామిడి రమేష్ కొడుకు మామిడి విక్రం, మరో అతను మేకల రాములు కొడుకు మేకల సాయి చరణ్‌లు ఇంటి నుంచి వెళ్లారని అన్నారు. సుమారు 12గంటల ప్రాంతంలో కాలనీకి చెందిన ముగ్గురు పిల్లలు ఈతకు వెళ్లి నీట మునిగారని సమాచారం అందించారని అన్నారు. అప్పటికే నీట మునిగిన ముగ్గురు విద్యార్థులను చెరువులో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, మృతి చెందారని తెలిపారు.

కాగా ఇందిరమ్మ కాలనీ సమీపంలో గల చెరువులో గత కొన్ని ఏళ్లుగా చేపల పెంపకం కోసం నీటిని భారీగా నిల్వ ఉంచుతున్నారని కాలనీవాసులు తెలిపారు. సంఘటన స్థలానికి గోదావరిఖని ఎసిపి గిరి ప్రసాద్, రామగుండం సిఐ చంద్రశేఖర్ గౌడ్, ఎన్టీపీసీ ఎస్‌ఐ జీవన్ వెళ్లి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News