Friday, December 20, 2024

మూడు రోజులగా ఏకధాటి వర్షం

- Advertisement -
- Advertisement -

సిటీ బ్యూరో ః వర్షంలో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. వర్షకాలం ప్రారంభం తర్వాతగత రెండు రోజులుగా నగర వ్యాప్తంగా వర్షం కురుస్తూనే ఉంది. గత రెండు రోజులుగా నగరవాసులకు సూర్యుడు దర్శనమై కరువైంది. అకాశాన్ని పూర్తిగా మబ్బులు కమ్మివేయడంతో నగరంలో చీకట్లు అలుముకున్నాయి. సోమవారం రాత్రి మొదలై ముసురు బుధవారం సైతం ఏకదాటిగా కొనసాగింది.పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురువగా మరికొన్ని చిరు జల్లులు పడ్డాయి. అయితే ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చిరు జల్లులే అయినప్పటికీ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకే పలు ప్రాంతాల్లో 2. సె.మిపైగా వర్ష పాతం నమోదు కావడంతో నగరమంతా చిత్తడిగా మారిపోయింది. మరో వైపు పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేయడంతో ఉదయం సాయంత్రం వేళ్లాలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. నగరంలోని ప్రధాన రహదారులైన ఉప్పల్ సికింద్రాబాద్, ప్యారడైజ్ బేగంపేట్ పంజాగుట్ట కొండాపూర్ ఎల్‌బినగర్ , కోఠి, లక్డీకాపూల్, అమీర్‌పేట్ కూకట్‌పల్లి, బాలానగర్ బోయిన్‌పల్లి, తిరుమల్ గిరి సికింద్రాబాద్ ట్యాంక్‌బండ్ కోఠి, చార్మినార్, చిలకగూడ చిక్కడ్‌పల్లి, నారాయణ గూడ తదితర మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడడంతో నగర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు గత రెండు రోజులుగా వర్షంలో తడిసి ముద్దవుతున్నారు. మరోవైపు వరస వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుండడంతో నగరం అంధకారం చోటు చేసుకుంది. ముసురు కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలుతున్నాయి. ఏకదాటి ముసురుకు ఇళ్ల గోడలు నానుతుండడంతో ఎప్పుడు ఏమి ప్రమాదం ముంచుకువస్తుందోనని శిధ్దిలా భవనాల్లో నివసిస్తున్నవారు బిక్కుబిక్కుమంటున్నారు. నగరంలో కురుస్తున్న ఏకదాటి వర్షాలతో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ అత్యవసర సహాయక బృందాలను మొహరించి సహాయక చర్యలను అందిస్తున్నారు. మరో వైపు డిఆర్‌ఎఫ్ బృందాలు నేల కూలిన చెట్లను తొలగించడంతో పాటు రోడ్లపైన నిలిచిన నీటి తోడి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుంట చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటలకు డిఆర్‌ఎఫ్ బృందాలకు 25 ఫిర్యాదులు అందాయి.

ఇందులో 18 చోట్ల చెట్లు నేలకూలగా వాటిని తొలగించడంతో పాటు 6 చోట్ల రోడ్లపై నిలిచిన నీటి తోడివేశారు. మరోవైపు అత్యవసర సహాయక బృందాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ మొదలు, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు సహాయక చర్యలను ఎప్పటీకప్పుడు పర్యవేక్షిస్తూ తాజా పరిస్థితులను ఆరా తీస్తున్నారు.
మరో మూడు రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్‌లో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో జిహెచ్‌ఎంసి మరింత అప్రమత్తమైంది.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ బుధవారం జిహెచ్‌ఎంసి అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంత భారీ వర్షం కురిసినా నగరవాసులకు ఏలాంటి ఇబ్బందులు కల్గకుండా పూర్తి అప్రమత్తతో ఉండాలని దీశా నిర్ధేశనం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News