Wednesday, January 22, 2025

‘మహిళా బంధు’ కెసిఆర్

- Advertisement -
- Advertisement -

Three days of festivities in name of Mahila Bandhu KCR

మన తెలంగాణ/హైదరాబాద్ : మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలకు టిఆర్‌ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ‘మహిళా బంధు కెసిఆర్’ పేరిట మూడు రోజుల పాటు ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో 6, 7, 8 తేదీల్లో మహిళా దినోత్సవ సంబురాలను ఊరు…వాడ…పల్లె…పట్టణం అన్న తేడా లేకుండా అతి వైభవంగా జరపాలని తలపెట్టింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహాక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులతో ప్రత్యేకంగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 6వ తేదీన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాఖీ కట్టడం ద్వారా ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడదామని పార్టీ నేతలకు ఆయన సూచించారు.

మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పధకాలపై మరోసారి పెద్దఎత్తున ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినిలు, ఆశా వర్కర్లు, ఎఎన్‌ఎంలు స్వయం సహాయక సంఘాల నాయకురాళ్లు తదితర మహిళలకు గౌరవ పూర్వక సన్మానం చేయాలని ఆదేశించారు. అలాగే- కెసిఆర్ కిట్, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేస్తున్నందుకు థాంక్యూ కెసిఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలను పెద్దఎత్తున ఏర్పాటు చేయాలన్నారు. 7వ తేదీన మహిళా సంక్షేమ కార్యక్రమాలు అయిన కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్‌లు, ఇతర మహిళా సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను నేరుగా ఇంటివద్దకెళ్లి కలవడం లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోవాలని ఆదేశించారు. 8 తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున(మార్చి 8) నియోజకవర్గ స్థాయిలో మహిళలతో సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలని కెటిఆర్ చెప్పారు.

గొప్ప పాలకుడు…

గతంలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుబంధు వారోత్సవాలతో పాటు కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు కెటిఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా తన రాజకీయ అనుభవంలో ఎదురైన క్షేత్రస్థాయి సమస్యలకు పరిష్కారం ఇస్తున్న గొప్ప పాలకుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ అని ఆయన పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపిస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రూపకల్పన చేశారని కొనియాడారు. అందులో భాగంగానే మహిళా సంక్షేమానికి సంబంధించి అపూర్వమైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఆడబిడ్డలకు నీటి కష్టాలను దూరం చేసేందుకు మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి, విజయవంతం చేశారన్నారు. మాతా శిశు సంరక్షణ కోసం కెసిఆర్ కిట్ పథకం అమలు చేశామన్నారు.

ఈ పథకం అమలుతో మాతా శిశు మరణాలు తగ్గాయన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సురక్షిత ప్రసవాలు పెరిగాయని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. కల్యాణలక్ష్మి కార్యక్రమం ఒక గొప్ప మైలురాయిని చేరుకుందన్నారు. ఇప్పటిదాకా సుమారు 10 లక్షల 30 వేల మంది పేద ఇంటి ఆడబిడ్డలకు పెళ్లి చేసిన దేశంలోని తొలి ప్రభుత్వంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం గుర్తింపు పొందిదన్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారులకు రూ. 9,022 కోట్లను పెళ్లి కానుకగా అందజేశామన్నారు. కెసిఆర్ కిట్టు ద్వారా ఇప్పటి దాకా సుమారు 11 లక్షల మందికి రూ. 1700 కోట్ల లబ్ధి చేకూర్చామన్నారు. ఇందులో ఒక్కొక్కరికి రూ. 13 వేల మేరకు ప్రయోజనం కల్పించామన్నారు. అలాగే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఒంటరి మహిళలకు, బిడి కార్మికులకు ఆసరా పింఛన్లు ఇస్తున్నదన్నారు. వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్నదని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా షీటీమ్స్, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఆయన గుర్తు చేశారు.

విద్యాశాఖలోనూ అద్భుతమైన కార్యక్రమాలు

విద్యాశాఖలోనూ అద్భుతమైన కార్యక్రమాలను చేపట్టినట్లు కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు, బాలికలకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని కెటిఆర్ తెలిపారు. సుమారు 70 లక్షల హెల్త్, హైజిన్ కిట్లను విద్యార్థినులకు అందించామన్నారు. ఇతరులు బేటీ బచావో.. బేటీ పడావో అంటూ కేవలం నినాదాలు ఇస్తున్న సమయంలో నిజంగా విద్యార్థులను చదివించి, సంరక్షిస్తున్న ప్రభుత్వం మనదే అని కెటిఆర్ స్పష్టం చేశారు. రాజకీయ, పారిశ్రామిక రంగాలలోనూ మహిళల కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News