Thursday, December 26, 2024

తగ్గిన ఎండలు .. తేలిక పాటి వర్షాలు

- Advertisement -
- Advertisement -

రెండు డిగ్రీలకు తగ్గిన ఉష్ణోగ్రతలు
ముత్తారంలో 43.8 డిగ్రీలు
వటవర్లపల్లిలో 172 మి.మి వర్షం

హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు తగ్గుతున్నాయి.. మండు వేసవిలో మారిన వాతావరణ పరిస్థితుల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం పగటి ఉష్ణోగ్రతల్లో రెండు డిగ్రీలవరకు తగ్గింది. ఈ వేసవిలో వారం రోజుల కిందట గరిష్టంగా 46.2డిగ్రీల వరకు వెళ్లిన ఉష్ణోగ్రతలు రాష్ట్రమంతటా శగలు చిమ్మాయి. అయితే వాతావరణ మార్పులో క్రమేపి ఇవి తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా 45డిగ్రీలు ఉన్న పగటి ఉష్ణోగ్రతలు 24గంటల్లోనే రెండు డిగ్రీల వరకు తగ్గాయి. సోమవారం రాష్ట్రంలో అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.8డిగ్రీల ఉష్ణొగ్రతలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో కూడా ఇదే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మంచిర్యాల జిల్లా కొండాపూర్, కరీంనగర్ జిల్లా తంగుల్ల, కొమరంభీమ్ జిల్లా కెరిమెరి,జంబుగ, నిర్మల్ జిల్లా తనుర్, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, మంచిర్యాల జిల్లా నీల్వాయ్ ,అదిలాబాద్ జిల్లా అర్లి తదితర ప్రాంతాల్లో గరిష్టంగా 43.7నుంచి 43డిగ్రీల మధ్యలో నమోదయ్యాయి. పలు చోట్ల ఆకాశం మేఘావృతంగా ఉండటంతో ఎండల తీవ్రత అంతగా కనిపించలేదు.

రాగల మూడు రోజులు వర్షాలే
రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు తూర్పు దక్షిణ జిల్లాల్లో ఉరుములు మెరుపులు గంటకు 50కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ద్రోణి విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్టు వాతవారణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38నుంచి 41డిగ్రీల వరకూ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.

వటవర్లపల్లిలో భారీ వర్షం
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో భారీ వర్షం కురిసింది. ఈ మండల పరిధిలోని వటవర్లపల్లిలో 172.3మి.మి వర్షం కురిసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. బొమ్మరాస్‌పేటలో 33.8, వైరాలో 27.5, గుండాలలో 14.5, సిర్పూర్‌లో 13, జైనూర్‌లో 11, అంగాపురంలో 9.8, శంకరంపేటలో 9.8 నర్సాపూర్‌లో 6.3 మి.మి వర్షం కురిసింది. మిగిలిన మరికొన్ని ప్రంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News